హైదరాబాద్‌ టెకీ సజీవ దహనం.. భార్యతో సహా ఆరుగురు మహిళలకు జీవిత ఖైదు!

ఐదేళ్ల కిందట అంటే 2020 అక్టోబర్‌లో జగిత్యాలకు చెందిన విజయ్‌ అనే వ్యక్తి కొండగట్టుకు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో మంజునాథ ఆలయం పక్కనే కుటీరంలో నివాసం ఉంటున్నాడు. అప్పట్లో విజయ్‌ తమ్ముడు జగన్‌ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో విజయ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అతని బావ..

హైదరాబాద్‌ టెకీ సజీవ దహనం.. భార్యతో సహా ఆరుగురు మహిళలకు జీవిత ఖైదు!
Hyderabad Techie Burnt Alive Case

Updated on: Jan 01, 2026 | 9:16 AM

హైదరాబాద్, జనవరి 1: ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని అల్వాల్‌లో కలకలం రేగిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు సజీవ దహనం కేసులో తాజాగా తీర్పు వెలువడింది. చేతబడి నెపంతో ఈ దారుణానికి పాల్పడినందుకు మృతుడి భార్యతో సహా మొత్తం ఆరుగురు మహిళలకు జీవత ఖైదు పడింది. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా కూడా కోర్టు విధించింది. ఈ మేరకు జగిత్యాల జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్ నారాయణ బుధవారం (డిసెంబర్ 31) సంచలన తీర్పు ఇచ్చారు. 2020 అక్టోబర్ నెలలో ఈ ఘటన చోటుచేసుకోగా తాజాగా తీర్పు వెలువడింది.

అసలేం జరిగిందంటే..

ఐదేళ్ల కిందట అంటే 2020 అక్టోబర్‌లో జగిత్యాలకు చెందిన విజయ్‌ అనే వ్యక్తి కొండగట్టుకు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో మంజునాథ ఆలయం పక్కనే కుటీరంలో నివాసం ఉంటున్నాడు. అప్పట్లో విజయ్‌ తమ్ముడు జగన్‌ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో విజయ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అతని బావ పవన్‌కుమార్‌ (38), భార్య కృష్ణవేణితో కలిసి 2020 అక్టోబరు 28న రాత్రి మంజునాథ ఆలయానికి వచ్చారు. పవన్‌ కుమార్‌ చేతబడి చేయించి తన భర్తను చంపించాడని జగన్‌ భార్య సుమలత అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆమె బంధువులతో కలిసి అతన్ని కుటీరంలోని ఓ గదిలో బంధించింది.

అనంతరం అందరూ కలిసి.. పవన్‌ ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో పవన్‌ సజీవంగా దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గది తాళం తీసే సరికే పవన్‌ కుమార్‌ దేహం పూర్తిగా దహనమై కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఈ వ్యవహారంలో పవన్‌ కుమార్‌ భార్య కృష్ణవేణితో పాటు మరో ఐదుగురి మహిళల పాత్ర ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గతంలో పవన్‌ భార్య కృష్ణవేణి బంధువుల ఇంటికి వెళ్లగా.. ఆమె నగలు ఎవరో చోరీ చేశారు. బావమరిది జగన్‌ వాటిని దొంగిలించాడన్న అనుమానంతో పవన్ తిట్టి, చంపుతానని బెదిరించాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు జగన్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పవన్‌ చేతబడి చేయించి జగన్‌ను చంపాడని బావమరిది కుటుంబ సభ్యులు అనుమానం పెంచుకున్నారు. ఈ క్రమంలో పవన్‌ను చంపేందుకు కృష్ణవేణితో కలిసి బంధువులు కుట్ర పన్నినట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జగిత్యాల కోర్టు మృతుడి భార్యతో పాటు మరో ఐదుగురు మహిళలకు జీవితఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.