తల్లి సంబంధాన్ని ప్రశ్నించిన కన్నకొడుకు.. కత్తి దాడిలో 21 ఏళ్ల యువకుడు మృతి!
హైదరాబాద్ పాతబస్తీలో 21 ఏళ్ల యువకుడి హత్య కలకలం రేపింది. తల్లి మనీషాతో భగత్ సింగ్‌కు ఉన్న సంబంధాన్ని మధుర్ సింగ్ వ్యతిరేకించడమే ఈ దారుణానికి కారణమా? లేక ఆస్తి వివాదం కూడా హత్యకు దారితీసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి బంధువులు చేస్తున్న ఆరోపణలతో ఈ కేసులో కొత్త కోణాలు తెరపైకి వచ్చాయి.

హైదరాబాద్ పాతబస్తీలో 21 ఏళ్ల యువకుడి హత్య కలకలం రేపింది. తల్లి మనీషాతో భగత్ సింగ్‌కు ఉన్న సంబంధాన్ని మధుర్ సింగ్ వ్యతిరేకించడమే ఈ దారుణానికి కారణమా? లేక ఆస్తి వివాదం కూడా హత్యకు దారితీసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి బంధువులు చేస్తున్న ఆరోపణలతో ఈ కేసులో కొత్త కోణాలు తెరపైకి వచ్చాయి.
హుస్సేనీ ఆలం పరిధిలో దారుణం
హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 24న ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మధుర్ సింగ్ తల్లి మనీషాతో భగత్ సింగ్‌కు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మధుర్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా, అది ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో భగత్ సింగ్ కత్తితో మధుర్‌పై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని కుటుంబ సభ్యులు, స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు మధుర్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
ఆస్తి కోసమే హత్య చేశాడా?
మధుర్ సింగ్ మృతిపై అతడి బంధువులు పలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. భగత్ సింగ్ మనీషాను వివాహం చేసుకున్నాడని, ఈ విషయం తమకు ఇటీవలే తెలిసిందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆస్తిని తన పేరు మీద రాయాలని మనీషాపై భగత్ సింగ్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకుని, ఆమె కుమారుడిని హత్య చేశాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆస్తి వివాదమే హత్యకు కారణమన్న విషయానికి ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. తల్లితో సంబంధాన్ని ప్రశ్నించడంతో జరిగిన ఘర్షణకు, ఆస్తి వివాదానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
పోలీసుల దర్యాప్తులో తేలాల్సిన నిజాలు
21 ఏళ్ల వయసులోనే మధుర్ సింగ్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, నిందితుడితో గతంలో ఏవైనా విభేదాలు ఉన్నాయా, ఆస్తి విషయంలో ఒత్తిళ్లు వచ్చాయా అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బంధువుల ఆరోపణలతో పాటు హత్యకు దారితీసిన అసలు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
