Hyderabad Police: మీ వాళ్లు బాగుపడితే మీరు బాగుంటరు.. వారి ఇంటికెళ్లి పోలీసులు ఏం చేస్తున్నారో తెలుసా..?
పోలీసులు అంటే నిజంగానే చట్టాన్ని రక్షించేవారని నిరూపిస్తున్నారు.. పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం పెంపొందేలా చేస్తున్నారు.. హైదరాబాద్ నగరంలో పాతుకుపోయిన రౌడీయిజాన్ని, నానాటికీ పెరిగిపోతున్న క్రైమ్ రేటుని తగ్గించే దిశగా కదం తొక్కుతున్నారు. ఇంటింటికీ వెళ్లి మరీ చట్టాల గురించి చెబుతూ, తప్పు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు. ఇదంతా హైదరాబాద్ నగర పోలీస్ శాఖ తీసుకున్న కీలక నిర్ణయం ద్వారా సాధ్యపడింది.

హైదరాబాద్ నగర కమిషనర్ ఆదేశాల మేరకు పాతబస్తీలో రౌడీ షీటర్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ఇంటింటికీ వెళ్లి పలకరిస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కొత్త చట్టాలు ఏ విధంగా ఉన్నాయో, క్రైమ్ చేస్తే ఏ విధంగా శిక్షలు పడతాయో వివరిస్తున్నారు. తప్పులు చేస్తే న్యాయ వ్యవస్థ విడిచిపెట్టే ప్రసక్తే లేదని.. ఎన్ని రోజులు తప్పించుకు తిరిగినా ఏదో ఒకరోజు బతుకు అంధకారం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు. పాతబస్తీలో ఇంటింటికీ వెళ్లి తమ కుటుంబ సభ్యుల వైఖరిని తెలుసుకుంటూ.. గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా లాంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. మరోమారు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
ఈ విధంగా పోలీసులు స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో వాళ్ల ఆర్థిక పరిస్థితి, కష్టాలు, కుటుంబ పోషణను పోలీసులకు వివరించారు. ఏదైనా ఉద్యోగంలో పెట్టిస్తే జీవితంలో ఎలాంటి తప్పులు చేయకుండా ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తామని కోరుతున్నారు. అధికారులు స్పందించి రౌడీ షీటర్లకు ఉద్యోగాలు కల్పిస్తూ తమ జీవితాలను మార్చాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరితగతిన చర్యలు చేపడతామని.. వీలైనంత త్వరగా ఏదో బతుకుదెరువు కల్పించేలా చూస్తామని పోలీసులు కూడా వారికి భరోసా కల్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
