AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?

హైదరాబాద్ సైదాబాద్‌లో నిర్మిస్తున్న కొత్త స్టీల్ బ్రిడ్జికి పేరు పెట్టే అంశం రాజకీయ చర్చగా మారింది. బీజేపీ సంగం లక్ష్మీబాయి, ఎంఐఎం ఏపీజే అబ్దుల్ కలాం, కాంగ్రెస్ సుధీర్ కుమార్, బీఆర్ఎస్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్లను ప్రతిపాదించాయి. చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి చివరగా ఎవరి పేరు ఖరారవుతుందో ఆసక్తిగా మారింది.

హైదరాబాద్‌లో కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?
Hyderabad Steel Bridge Saidabad
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 2:11 PM

Share

హైదరాబాద్ సైదాబాద్‌లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి ఎవరు పేరు పెట్టాలనేది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ప్రతీ పార్టీ వేర్వేరు పేర్లు ప్రతిపాదించడంతో గందరగోళం నెలకొంది. చంచల్‌గూడ ఫైర్ స్టేషన్ నుంచి ఐ.ఎస్.సదన్ మీదుగా సంతోష్‌నగర్ వరకు నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. కట్టడం అయితే సిద్ధమవుతోంది.. కానీ దానికి ఏ పేరు పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద పంచాయతీగా మారుతోంది. పేరు ఒక్కటే పెట్టాలి.. కానీ రేసులో మాత్రం నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ ఒక పేరు.. ఎంఐఎం మరో పేరు.. కాంగ్రెస్ ఇంకో పేరు.. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా తన ప్రతిపాదనతో రంగంలోకి దిగింది. దీనికి తోడు స్థానిక సంఘాల నుంచి కూడా డిమాండ్ మొదలైంది. దీంతో ‘నేమ్ ప్లేట్‌పై చివరకు ఎవరి పేరు కనిపిస్తుంది?’ అన్నది ఆసక్తికరంగా మారింది.

బీజేపీ ప్రతిపాదన.. ‘సంగం లక్ష్మీబాయి’

ఈ పేరు పంచాయతీకి బీజేపీ వైపు నుంచి సంగం లక్ష్మీబాయి పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. స్వాతంత్ర్య సమరయోధురాలిగా, ప్రజాప్రతినిధిగా ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ ఆమె పేరును పెట్టాలన్నది ఈ వర్గం నుంచి వినిపిస్తున్న డిమాండ్. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. బీజేపీ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనకు స్థానికంగా కూడా మద్దతు లభిస్తోంది. తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ సైతం సంగం లక్ష్మీబాయి పేరునే పెట్టాలని కోరుతున్నారు.

MIM.. ‘కలాం పేరు పెట్టండి’

మరోవైపు ఎంఐఎం నేతలు పూర్తిగా మరో పేరును తెరపైకి తీసుకొచ్చారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని కోరుతున్నారు. శాస్త్రవేత్తగా దేశానికి సేవలందించడంతో పాటు యువతకు స్ఫూర్తిగా నిలిచిన కలాం పేరు పెడితే అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందన్న వాదన ఈ ప్రతిపాదన వెనుక వినిపిస్తోంది.

కాంగ్రెస్ లెక్క వేరు.. ‘సుధీర్ కుమార్’

బీజేపీ, ఎంఐఎం పేర్లు చర్చలో ఉండగానే కాంగ్రెస్ నేతలు సుధీర్ కుమార్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆయన పేరు పెట్టాలని కాంగ్రెస్ వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. దీంతో అప్పటివరకు రెండు పేర్ల మధ్య కనిపించిన పోటీ కాస్తా మూడు పేర్ల పోటీగా మారింది.

ఇప్పుడు BRS ఎంట్రీ.. శ్రీనివాస్ రెడ్డి పేరు తెరపైకి

ఇంతలో బీఆర్ఎస్ కూడా పేరు పంచాయతీలోకి ఎంట్రీ ఇచ్చింది. సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేరు పెట్టాలని టిఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు. దీంతో రాజకీయంగా ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. బీజేపీ వైపు నుంచి సంగం లక్ష్మీబాయి.. ఎంఐఎం నుంచి ఏపీజే అబ్దుల్ కలాం.. కాంగ్రెస్ నుంచి సుధీర్ కుమార్.. బీఆర్ఎస్ వైపు నుంచి సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ఇప్పుడు రేసులోకి వచ్చాయి.

నేమ్ ప్లేట్ ఒక్కటే.. మరి పేరు ఎవరిది?

అసలు కథ ఇప్పుడు ఇక్కడే మొదలవుతోంది. పేరు పెట్టాల్సింది ఒక్కటే.. కానీ ప్రతిపాదనలు మాత్రం నాలుగు. రాజకీయ పార్టీల ప్రతిపాదనల్లో ఏది పైచేయి సాధిస్తుంది? చారిత్రక నేపథ్యం ఉన్న వ్యక్తికి అవకాశం ఇస్తారా? స్థానికంగా సేవలు చేసిన వారి పేరును పరిశీలిస్తారా? అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తి పేరును ఎంపిక చేస్తారా? లేక ప్రభుత్వం మరో పేరుతో సర్‌ప్రైజ్ ఇస్తుందా? అన్నది ఉత్కంఠగా మారుతోంది.

పేరు చుట్టూ మొదలైన రాజకీయ పంచాయతీ!

సాధారణంగా ఓ నిర్మాణానికి పేరు పెట్టడం పరిపాలనాపరమైన నిర్ణయం. కానీ ఇప్పుడు ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ముందుకు రావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పటివరకు ఏ పేరు ఖరారైందనే దానిపై అధికారిక నిర్ణయం రావాల్సి ఉంది. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ ప్రతిపాదనలు, డిమాండ్లుగానే చూడాలి. సంగం లక్ష్మీబాయినా..? ఏపీజే అబ్దుల్ కలామా..? సుధీర్ కుమారా..? సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డినా..? నేమ్ ప్లేట్‌పై చివరకు ఎవరి పేరు పడుతుందో తెలియదు కానీ.. పేరు ఖరారు కాకముందే మొదలైన ఈ ‘నేమ్ వార్’ మాత్రం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారుతోంది.

Follow Us