Hyderabad: బిర్యానీ లవర్స్‌కు బిగ్ షాక్.. ఇకపై జేబుకు చిల్లే.. ఎందుకంటే..?
హైదరాబాద్ అంటేనే బిర్యానీ.. బిర్యానీ అంటేనే హైదరాబాద్. కానీ త్వరలోనే ఆ ఘుమఘుమలు సామాన్యుడి జేబుకు గట్టి షాక్ ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలకు తోడు, ఇప్పుడు బిర్యానీ ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. ధరలు భారీగా పెంచేందుకు రెస్టారెంట్లు సిద్ధమవుతుండటంతో ఫుడ్ లవర్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక్క ప్లేట్‌పై ఎంత పెరగనుంది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు తీవ్ర నిరాశ కలిగించే వార్త ఇది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుల జేబులకు త్వరలోనే మరింత భారం పడనుంది. మార్కెట్‌లో చికెన్, బాస్మతి బియ్యం, మసాలా దినుసులు, వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూ ధరలను పెంచేందుకు సమాయత్తమవుతున్నాయి. బిర్యానీ తయారీకి అత్యంత కీలకమైన పదార్ధాల ధరలు ప్రస్తుతం భారీగా పెరిగాయి. గతంలో కిలో రూ.95 వరకు లభించిన నాణ్యమైన బాస్మతి రైస్ ధర ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయికి చేరింది. పౌల్ట్రీ ఫీడ్ వ్యయం విపరీతంగా పెరగడం వల్ల చికెన్ ధర ఇప్పటికే కిలోకు రూ.300 మార్కును తాకింది. బిర్యానీకి ప్రత్యేక సువాసన, రుచిని అందించే స్పైసెస్, యాలకులు, లవంగాలు, ఇతర మసాలా దినుసులతో పాటు వంట నూనెల ధరలు కూడా ఊహించని రీతిలో పెరిగాయి.
తప్పనిసరి పరిస్థితుల్లోనే పెంపు
ముడి సరుకుల ధరలు ఈ స్థాయిలో పెరగడంతో హోటళ్ల నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగిపోయిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల వేతనాలు, కరెంట్ బిల్లులు, గ్యాస్ సిలిండర్ల ఖర్చులతో పాటు ముడి సరుకుల భారాన్ని ఇకపై తాము మాత్రమే భరించడం సాధ్యం కాదని చెబుతున్నారు. వ్యాపారాలు కొనసాగించాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ధరల సవరణ చేయక తప్పట్లేదని స్పష్టం చేస్తున్నారు.
దీపావళి తర్వాత నుంచే కొత్త ధరలు అమలు?
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, దీపావళి ముగిసిన వెంటనే పెంచిన కొత్త ధరలను అమల్లోకి తీసుకురావడానికి రెస్టారెంట్ అసోసియేషన్లు, హోటల్ యజమానులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. ఒక్కో ప్లేట్ బిర్యానీపై కనీసం రూ.50 నుండి రూ.100 వరకు పెరిగే అవకాశం ఉంది. సాధారణ చిన్న హోటళ్ల నుంచి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల వరకు అన్నింటా ఈ పెంపు ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. వారాంతాల్లో కుటుంబంతో కలిసి బిర్యానీ ఆస్వాదించాలనుకునే వారికి, నిత్యం హోటళ్లపై ఆధారపడే బ్యాచిలర్లకు ఈ ధరల పెంపు పెద్ద భారంగా మారనుంది. ఫలితంగా బిర్యానీ ప్రియులు తమ అభిమాన వంటకాన్ని ఆస్వాదించాలంటే ఇకపై జేబులు మరింత గుల్ల చేసుకోవాల్సిందే.
