AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad By Poll: దమ్ముంటే డిపాజిట్ తెప్పించు అన్న పార్టీలో అదే జరిగింది.. హుజురాబాద్‌లో డీలాపడ్డ కాంగ్రెస్

ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రాజేశాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి.

Huzurabad By Poll: దమ్ముంటే డిపాజిట్ తెప్పించు అన్న పార్టీలో అదే జరిగింది.. హుజురాబాద్‌లో డీలాపడ్డ కాంగ్రెస్
Revanth Reddy
Balaraju Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 03, 2021 | 12:04 PM

Share

Congress in Huzurabad By Poll: ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రాజేశాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఓటమి పట్ల టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ సీనియర్లు. హుజూరాబాద్‌లో గెలుపు కోసం రేవంత్‌ శ్రమించలేదని మండిపడుతున్నారు.హుజూరాబాద్‌ ఎన్నికలను ఎవరూ పట్టించుకోలేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. క్యాడర్‌ ఉన్నా ఓటు వేయించుకోలేకపోయాము. వాస్తవ పరిస్థితిని హైకమాండ్‌కు చెప్పుతానన్నారు.

హుజూరాబాద్‌లో బల్మూర్‌ వెంకట్‌ని రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క బలి పశువును చేశారని మరో సీనియర్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. డిపాజిట్‌ వస్తే రేవంత్‌ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారా. ఇలాంటి ప్రచారానికి రేవంత్‌ మనుషులు సిద్ధంగా ఉన్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభలతో ప్రయోజనం ఉండదని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అయినా హుజురాబాద్‌లో గెలిచింది ఈటల రాజేందరేనని, బీజేపీ కాదన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అసంతృప్తికి గురైన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒకే విషయం పదే పదే చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల తరబడి ఉన్నవారిని కాదని.. వలసొచ్చిన నేతకి పట్టం కట్టడంపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఈ పరిణామం కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర నిరాశకు గురిచేసింది. పార్టీలో సీనియర్లను కాదని బయటి నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ పెదవి విరిచేవారు. ఆఖరికి.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో దమ్ముంటే డిపాజిట్ తెప్పించి చూపించాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాళ్లు విసిరినంత పనిచేశారు.

చివరికి ఉప ఎన్నికలో అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ తెచ్చుకోలేని స్థాయికి పడిపోయింది. అటు రేవంత్.. ఇటు సీతక్క.. ఇతర సీనియర్లు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఎంతమంది వచ్చి ఇంటింటికీ తిరిగినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హుజూరాబాద్‌లో కనీసం డిపాజిట్ దక్కలేదు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బల్మూరి వెంకట్ కనీసం కనుచూపుమేరలో కనిపించకపోవడం మింగుడుపడని విషయమే.

హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,37,036 ఓట్లు ఉండగా.. ఈ ఉప ఎన్నికలో 2,05,236 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కి 1,06,780 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కి 82,712 ఓట్లతో రెండోస్థానంలో నిలిచాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కి కేవలం మూడు వేల ఓట్లు రావడం పార్టీని కలవరపాటుకి గురిచేసింది. కనీసం డిపాజిట్ రాకపోవడం గమనార్హం. ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లను డిపాజిట్‌గా పరిగణిస్తారు. హుజూరాబాద్‌లో రెండు లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. కనీసం 34 వేల ఓట్లు వస్తే డిపాజిట్ తెచ్చుకున్నట్టే. కానీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 3,012 ఓట్లు మాత్రమే రావడం భారీ షాక్‌గానే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 61,121 ఓట్లు సాధించింది. సరిగ్గా మూడేళ్లు గడవకుండానే జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చెల్లాచెదురైపోవడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేసే అంశంగా మారింది.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ నేతల అంతర్గత విభేదాల కారణంగానే ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువై.. నేతలు వేదికలకెక్కి విమర్శలు చేసుకోవడం వల్లే ఈ దుస్థితి దాపురించేందుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also…

హుజూరాబాద్‌లో మరోసారి జయకేతనం ఎగురవేసిన ఈటెల.. గెలుపుతో బీజేపీలో జోష్‌..