
శంకరపట్నం మండల కేంద్రంలోని హైస్కూల్ వద్ద భారీ కొండచిలువ కనిపించడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. పక్కనే ఉన్న పంట పొలాల నుంచి రోడ్డు దాటుతుండగా కొండచిలువను చూసి కొందరు యువకులు ఫొటోలు తీసి వివిధ మాధ్యమాల ద్వారా సమాచారం చేరవేశారు. అయితే ఈ కొండ చిలువ భారీ సైజ్‌లో ఉంది. పంట పొలాల నుంచి నేరుగా రోడ్డుపైకి వచ్చింది. సడన్‌గా రోడ్డుపైకి రావడంతో వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. కాసేపు రోడ్డుపైన అటూ.. ఇటూ తిరిగింది. సుమారుగా 20 నిమిషాల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.
అయితే రోడ్డు నుంచి మళ్లీ పంట పొలాల వైపు వెళ్లింది. కొండచిలువ ఇదే ప్రాంతంలో సంచరించడంతో రైతులు భయపడుతున్నారు. ఇప్పుడు నీళ్లు పెట్టే సమయం.. దీంతో వరిపొలం దగ్గరికి వెళ్లాలంటే జంకుతున్నారు. దూడలు, మేకలను, గొర్రెలను కూడా పొలాల వద్ద ఉంచడం లేదు. కొండచిలువ దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న కొండచిలువను బంధించాలని కోరుతున్నారు స్థానిక రైతులు. ఈ ప్రాంతంలో మరికొన్ని కొండచిలువలు ఉన్నాయని స్థానికులు భయపడుతున్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు, పొలాల పక్కనే నివాసాలు కలిగిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి