AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్తగా నిర్మించబోయే ఎలివేటెడ్‌ కారిడార్ విషయంలో మరో ముందడుగు పడింది. బంజారాహిల్స్‌ నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ వరకు నిర్మించబోతున్న ఈ కారిడార్ కోసం తాజాగా టెండర్లు పిలిచారు. ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌ ద్వారా బిడ్లు స్వీకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!
Hmda Elevated Corridor
Anand T
|

Updated on: Sep 08, 2026 | 3:22 PM

Share

హైదరాబాద్‌ నగరంలో కీలక ప్రాంతమైన ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌ పెట్టేందుకు హెచ్ఎండీఏ (HMDA) ఒక కొత్త ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతోంది. ఈ కొత్త కారిడార్‌ను బంజారాహిల్స్‌ నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ వరకు నిర్మించనున్నారు. తాజాగా ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్లు ఈ నెల 22 లోపు బిడ్లు దాఖలు చేయాలని పేర్కొంది. టెండర్లు ఖరారయ్యాక నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.

ఈ రూట్‌లోనే కొత్త కారిడార్

ఈ కొత్త కారిడార్‌ను బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ వరకు దాదాపు 9 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి హెచ్ఎండీఏ దాదాపు రూ.1,656 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కారిడార్‌ నిర్మాణాన్ని మొత్తం రెండు దశల్లో పూర్తి చేసేలా అధికారులు డీపీఆర్ (DPR) సిద్ధం చేశారు. మొదటి దశలో ఫిలింనగర్‌ నుంచి శిల్పా లేఅవుట్‌ వరకు 5 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఇక రెండో దశలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి హకీంపేట్‌ కుంట వరకు 4 కి.మీ కారిడార్‌ను నిర్మించనున్నారు.

ఈ కారిడార్ నిర్మాణం పూర్తయ్యాక రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దీనిపై దాదాపు ఆరు ర్యాంప్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఫిలింనగర్‌ రోడ్డు నం. 82 వద్ద, నార్నే రోడ్, జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 52, ఐటీసీ కోహినూర్‌ రోడ్, టీ-హబ్‌ జంక్షన్, మైండ్‌స్పేస్‌ వద్ద ఈ ర్యాంప్‌లను నిర్మించనున్నారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఈ రూట్‌లో మెట్రో రైలు విస్తరణ జరిగినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కారిడార్‌ను డిజైన్ చేశారు.

ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తే ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీ చెక్‌పోస్టు, ఫిలింనగర్ మీదుగా వెళ్లే వారికి భారీ ఊరట లభించనుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. అలాగే నగర నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) జంక్షన్‌కు చేరుకోవడం మరింత సులభతరం కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us