Telangana: నిర్మల్ కోటలో బయటపడిన అద్భుతం.. ఈ సీక్రెట్ ప్లేస్ చూసి అవాక్కవుతున్న జనం
నిర్మల్ అంటేనే గడ్ల కోట.. శత్రువుల గుండెల్లో దడ పుట్టించే వ్యూహాల అడ్డా.. అలాంటి నిర్మల్ కోటపై ఇప్పుడు మరో రహస్య మెట్ల బావి వెలుగులోకి వచ్చింది. సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తున, అసలు నీటి జాడలే లేని చోట ఈ బావిని ఎందుకు తవ్వారు..? 200 మెట్లతో నిర్మించిన ఈ రహస్య మార్గం వెనుక ఉన్న సైనిక వ్యూహం ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

నిమ్మలనాయుడు ఏలిన నిర్మల్‌లోని ఓ కోటలో రహస్య మెట్ల బావి బయటపడింది. సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తున ఉన్న ఈ కోటపై ఎలాంటి నీటి జాడలు లేకున్నా.. తూర్పు వైపున రహస్య మెట్ల బావి తవ్వించడం చూస్తుంటే దీనిని సైనిక స్థావరంగా అప్పటి పాలకులు ఉపయోగించుకొని ఉంటారని నిపుణుల బృందం అంచనా వేసింది. శత్రువులు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి రహస్య మార్గం ద్వారా సైనికులు ఇతర ప్రాంతానికి చేరుకునేందుకు, తిరిగి దాడి చేసేందుకు వీలుగా ఈ రహస్య మెట్ల మార్గం తవ్వించారని నిపుణులు భావిస్తున్నారు. సుమారు 200 మెట్లను బలమైన రాళ్లతో నిర్మించారని.. ప్రభుత్వం ఇలాంటి వాటి పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని చరిత్ర పరిశోధకులు కోరుతున్నారు. సాహితీవేత్త అబ్బడి రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఈ కోటను సందర్శించిన సమయంలో ఈ మెట్ల బావి వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు.
నిర్మల్ అంటేనే కోటలు, గడ్లకు ప్రసిద్ధి. బత్తీస్‌గఢ్, శ్యాంగఢ్ , ధం ధంగఢ్, ఏకశిలా గఢ్, సోన్‌గఢ్, చిట్టీగఢ్ ఇలా ఒకటా రెండా నిర్మల్ అష్టదిక్కులను కాపాడుతూ శత్రు దుర్బేద్యమైన గఢ్‌లే ఎటు చూసినా. అందులో ఒక్కో కోటకు ఒక్కో చరిత్ర ఉంది. పట్టణానికి తూర్పున ఎత్తైన గుట్టపై నిలువెత్తుగా ఉన్న బత్తీస్గఢ్ ఆ రోజుల్లో శత్రువుల గుండెలను దడదడలాడించింది. హిందీలో బత్తీస్ అంటే 32. ఒకదానికొకటి ఆనుకుని 32 గదులను నిర్మించారు. దీంతో దీనికి బత్తీస్గఢ్ అనే పేరొచ్చింది. శ్రీనివాసరావు కాలంలో ఫ్రెంచ్ ఇంజినీర్ల సలహాలతో మట్టికోటగా ఉన్న బత్తీస్‌గఢ్‌ను డంగుసున్నం, ఇటుక రాయితో బలమైన కోటగా మార్చారు. ఎత్తైన బురుజును నిర్మించి దానిపై ఫిరంగులను అమర్చారు. ఈ గఢ్‌లోనే మందుగుండు, ఆయుధాలు తయారు చేసేవారికి వసతి కల్పించారు. నిమ్మలనాయుడు తన పాలనకాలంలోనే ఎక్కువ గడ్లను నిర్మించాడు. పట్టణానికి దక్షిణం వైపు సైన్యాన్ని ఉంచేందుకు విశాలమైన శ్యాంగడ్‌ను నిర్మించారు. అప్పటి తన అశ్వ సైన్యాధిపతి పేరుమీదుగా దీనికి శ్యాంగఢ్ పేరుపెట్టినట్లు చెబుతారు. పట్టణంలోకి ఎవరు రావాలన్నా ఈ గడ్‌ను దాటుకునే రావాల్సి ఉంటుంది. ఇప్పుడిది అసాంఘిక కార్యకలాపాకు అడ్డాగా మారింది.
