TG Rains: తొలకరితో చల్లబడిన తెలంగాణ.. 3 రోజులపాటు ఉరుములు, మెరుపుల‌తో భారీ వర్షాలు

|

Jun 11, 2024 | 10:43 AM

తెలంగాణ‌ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో రుతుప‌వ‌నాలు వేగంగా విస్తరించాయి. ఈ రోజు ఉత్తర అరేబియా స‌ముద్రం, మ‌హారాష్ట్రలోని మ‌రికొన్ని ప్రాంతాల్లో రుతుప‌వ‌నాలు విస్తరించ‌నున్నాయి. అలాగే రాష్ట్రంలోని నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజ‌య‌న‌గ‌రం, ఇస్లాంపూర్ వ‌ర‌కు విస్తరించే అవకాశం ఉంది. నైరుతి రుతుప‌వనాల విస్తర‌ణ నేప‌థ్యంలో తెలంగాణ‌లో రానున్న మూడు రోజులు..

TG Rains: తొలకరితో చల్లబడిన తెలంగాణ.. 3 రోజులపాటు ఉరుములు, మెరుపుల‌తో భారీ వర్షాలు
TG Rains
Follow us on

హైదరాబాద్‌, జూన్‌ 11: తెలంగాణ‌ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో రుతుప‌వ‌నాలు వేగంగా విస్తరించాయి. ఈ రోజు ఉత్తర అరేబియా స‌ముద్రం, మ‌హారాష్ట్రలోని మ‌రికొన్ని ప్రాంతాల్లో రుతుప‌వ‌నాలు విస్తరించ‌నున్నాయి. అలాగే రాష్ట్రంలోని నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజ‌య‌న‌గ‌రం, ఇస్లాంపూర్ వ‌ర‌కు విస్తరించే అవకాశం ఉంది. నైరుతి రుతుప‌వనాల విస్తర‌ణ నేప‌థ్యంలో తెలంగాణ‌లో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

మంగళవారం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని సూచించింది. ఇక బుధవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.

ఈ రెండు రోజులపాటు ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన ఈదురు గాలుల‌తో వ‌ర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ‌, సూర్యాపేట‌, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, గ‌ద్వాల జిల్లాల్లో అక్కడ‌క్కడ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.