సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ.. పేర్కొన్న అంశాలివే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమే అని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ.. పేర్కొన్న అంశాలివే..
Harish Rao
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 01, 2024 | 1:33 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమే అని విమర్శించారు. దీనిని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక పేపర్‌ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా, ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలతో పోలిస్తే ఈ ఫీజులు డబుల్‎గా ఉన్నాయని తెలిపారు. రిజర్వుడ్‌ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులతో సమానంగా వసూలు చేయడం బాధాకరం అన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సీటెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్‌ఈ ఫీజు రాయితీని అమలు చేస్తున్నది.

మన రాష్ట్రంలో ఎపిసెట్‌, ఐసెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లోనూ ఫీజుల రాయితీని అమలు చేస్తున్నారు. కానీ టెట్‌లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదని లేఖలో ప్రస్తావించారు. టెట్ ఫీజుల పెంపు, రిజర్వుడ్‌ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించక పోవడాన్ని నిరసిస్తూ బీఈడీ, డీఎడ్‌ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారన్నారు. పుస్తకాలు వదిలి రోడ్డకెక్కి ఉద్యమిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన. నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. వెంటనే టెట్‌ ఫీజులు తగ్గించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం అని లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..