Telangana: ఆరోగ్యమే మహాభాగ్యం ఇది అందరికీ తెలిసిందే..గత కొన్నేళ్ల క్రితం వరకూ మనిషి జీవన విధానం ఆరోగ్యకరంగా ఉండేది. కడుపు నిండుగా తిని.. శరీరం అలసివరకూ కష్టపడి పనిచేసేవారు. రాత్రి త్వరగా నిద్రపోయేవారు.. ఉదయమే నిద్రలేచి..తమదైనందిన కార్యక్రమాలను మొదలు పెట్టేవారు.. అయితే కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో భాగంగా ప్రస్తుతం జీవన విధానం పూర్తిగా మారిపోయింది. దీంతో చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే మళ్ళీ ఆరోగ్యంగా పట్ల.. ఆరోగ్యకరమైన జీవన విధానంపై నేటి యువత దృష్టి సారిస్తోంది. వ్యాయామం, యోగా వంటి వాటిపై దృష్టి పెట్టింది. అయితే ఏ చిన్నపని కోసం బయటకు వెళ్లాలన్నా.. బైక్స్ నే ఆశ్రయిస్తున్నారు.. చాలామంది యువతీయువకులు. సైకిల్ అన్న మాటనే మరచిపోయారు. కానీ జిమ్ లో మాత్రం వ్యాయామం పేరుతో.. గంటల తరబడి.. సైకిల్ తొక్కుతుండం విశేషం.. అలాంటి నేటి జనరేషన్ కు ఆదర్శం ఈ 60 ఏళ్ల మహిళ.. వివరాల్లోకి వెళ్తే..
హనుమకొండలోని న్యూ శాయంపేటకు చెందిన 60 ఏళ్ల శకుంతల ఇప్పటికీ ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ ను ఇంటినుంచి బయటకు తీస్తారు.. సైకిల్ ఎక్కి.. చకచకా తాను కోరుకున్న చోటకు వెళ్తారు. అలుపు ఆయాసం లేకుండా చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు..వరంగల్, కాజీపేట, హనుమకొండ వంటి చోట్లకు కూడా ప్రయాణం చేయాలంటే.. శకుంతల సైకిల్ నే ఆశ్రయిస్తారు. ఎండ, వాన, చలి ఏ కాలమైనా.. ఎటువంటి పరిస్థుల్లోనైనా ఇప్పటికీ సైకిల్ మీదనే ఆశ్రయిస్తారు. తనకు ఈ వయసులో కూడా ఎటువంటి వ్యాధులు లేవని..షుగర్, బీపీ అంటే ఏమిటో తెలియదని నవ్వుతు చెబుతున్నారు.
శకుంతల భర్త చిరుద్యోగి.. దిగుమధ్యతరగతి జీవితం.. దీంతో వివాహాదికార్యక్రమాల్లో పిండివంటలు చేస్తూ భర్తకు ఆర్ధికంగా అండగా నిలబడ్డారు. అవసరం కోసం అప్పట్లో అతికష్టం మీద సైకిల్ తొక్కడం నేర్చుకున్నట్లు.. ఇప్పుడు అది అలవాటుగా మారినట్లు చెబుతున్నారు. తాను ఒక్కరోజూ కూడా సైకిల్ తొక్కకుండా ఉండలేనని.. తన సైకిల్ చాలా పాతది అయిపొయింది.. ఇప్పుడు కొత్త సైకిల్ కొనే స్థోమత లేదని.. ఎవరైనా దాతలు స్పందించి సైకిల్ కొనిస్తే చాలా సంతోషిస్తానని చెబుతున్నారు ఆరుపదుల శకుంతల.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..