AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీపీపీ మోడల్.. ఉచిత టెస్టులకు సరికొత్త ప్రణాళిక

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్య పరికరాల నిర్వహణ సమస్యలకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌ను పరిశీలిస్తోంది. ఈ విధానంలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్‌రే, రక్తపరీక్షల వంటి డయాగ్నస్టిక్ సేవలను ప్రైవేట్ సంస్థలు నిర్వహించగా, రోగులకు పరీక్షలు ఉచితంగా అందించి ఖర్చును ప్రభుత్వం భరించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాణ్యమైన నిర్ధారణ సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీపీపీ మోడల్.. ఉచిత టెస్టులకు సరికొత్త ప్రణాళిక
Free Diagnostic Tests
Prabhakar M
| Edited By: |

Updated on: Jul 01, 2026 | 8:07 AM

Share

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణలో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్ ద్వారా సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్‌రే, రక్తపరీక్షల వంటి డయాగ్నస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన వైద్య పరికరాలను టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. గ్యారంటీ కాలం ముగిసిన తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల అనేక యంత్రాలు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో రోగులు ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రతిపాదిత పీపీపీ విధానంలో యంత్రాలను ప్రైవేట్ సంస్థలే ఏర్పాటు చేస్తాయి. వాటి నిర్వహణ, విడిభాగాల మార్పు, అవసరమైన రియాజెంట్లు, ఇతర వినియోగ వస్తువులన్నింటినీ అదే సంస్థలు చూసుకుంటాయి. ప్రభుత్వం ఆస్పత్రిలో అవసరమైన స్థలం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పిస్తుంది. ప్రభుత్వ వైద్యుడు సూచించిన పరీక్షలను రోగులు అదే ఆస్పత్రిలో చేయించుకోవచ్చు. పరీక్షలకు రోగుల నుంచి డబ్బు వసూలు చేయకుండా, ఆయా పరీక్షల ఖర్చును ప్రభుత్వం నేరుగా నిర్వహణ సంస్థలకు చెల్లించే విధానాన్ని అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది.

ఈ విధానం అమలైతే యంత్రాలు చెడిపోవడం వల్ల సేవలు నిలిచిపోవడం, రోగులను బయట ప్రైవేట్ కేంద్రాలకు పంపించడం వంటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాణ్యమైన నిర్ధారణ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ మోడల్ ద్వారా డయాగ్నస్టిక్ సేవలు అందిస్తున్నారు. కొన్ని చోట్ల స్వల్ప యూజర్ ఛార్జీలు ఉండగా, పేద కుటుంబాలకు ప్రత్యేక కార్డుల ద్వారా ఆ భారం కూడా ప్రభుత్వాలే భరిస్తున్నాయి.

తెలంగాణలో ఈ విధానాన్ని ఏ రూపంలో అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరికరాల వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us