AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Raj: ముదిరిన వివాదం.. హీరో అఖిల్ రాజ్ కారుపై దాడికి యత్నం.. రంగంలోకి పోలీసులు..

'రాజు వెడ్స్ రాంబాయి' ఫేం హీరో అఖిల్ రాజ్, ఓ డెలివరీ బాయ్ మధ్య జరిగిన వాగ్వాదం పెద్ద వివాదంగా మారింది. రాంగ్ డెలివరీతో మొదలైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డెలివరీ బాయ్స్ అఖిల్ ఇంటి వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇరు వర్గాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేయగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Akhil Raj: ముదిరిన వివాదం.. హీరో అఖిల్ రాజ్ కారుపై దాడికి యత్నం.. రంగంలోకి పోలీసులు..
Akhil Raj Controversy
Shaik Madar Saheb
|

Updated on: Jul 01, 2026 | 7:34 AM

Share

రాజు వెడ్స్ రాంబాయి ఫేం అఖిల్ చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. హీరో వర్సెస్ డెలివరీ బాయ్స్‌గా ఈ ఇష్యూ మారింది. ఇరు వర్గాలూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. ఒకరిపై ఒకరు కొట్టుకునే దాకా వెళ్లారు. అసలు ఏం జరిగింది? ఒక ఐటమ్‌ను రాంగ్ డెలివరీ చేసినందుకు ఇంత పెద్ద గొడవ జరిగిందా? డెలివరీ బాయ్స్ అంతా కలిసి హీరో కారును ఎందుకు వెంటాడారు? అసలు తప్పు ఎవరిది?.. అనే వివరాలను తెలుసుకుందాం.. గచ్చిబౌలి ఏరియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది! హీరో అఖిల్ రాజ్ తమ తోటి డెలివరీ బాయ్‌ను అవమానించాడనే వార్త దావానలంలా వ్యాపించడంతో డెలివరీ బాయ్స్ ఒక్కటయ్యారు. అఖిల్ ఉంటున్న అరుణ రెసిడెన్సీ వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో కాసేపు రెక్కీ చేశారు. హీరో ఎప్పుడు బయటకు వస్తాడా అని కాపు కాశారు. సరిగ్గా అఖిల్ తన కారులో ఇంటి నుంచి బయటకు రాగానే.. డెలివరీ బాయ్స్ గుంపు ఒక్కసారిగా కారును చుట్టుముట్టి దాడికి ప్రయత్నించింది. ప్రాణభయంతో అఖిల్ తన కారులోనే ఉండి.. ఆ విజువల్స్‌ను, తనను వెంబడిస్తున్న వారిని మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశాడు. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నా వినకుండా వారు రెచ్చిపోవడంతో.. అఖిల్ నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఫిర్యాదు చేశాడు. అంతకుముందే, ఉదయమే సదరు డెలివరీ బాయ్ కూడా అఖిల్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు వర్గాల కేసులను సీరియస్ గా తీసుకున్నారు.

ఈ ఫిర్యాదుల కంటే ముందే సోషల్ మీడియా వేదికగా ఇరు పక్షాల మధ్య తీవ్రమైన ఆరోపణల యుద్ధం నడిచింది. మొదట బాధితుడిగా చెప్పుకున్న డెలివరీ బాయ్ రమేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కన్నీరు పెట్టుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. తాను చేసిన చిన్న పొరపాటుకు క్షమాపణలు చెప్పినా వినకుండా, హీరో అఖిల్ తనను దారుణంగా దూషించాడని, కొట్టడానికి వచ్చాడని ఆరోపించాడు. అంతటితో ఆగకుండా తనపై ఉమ్మివేసి తీవ్రంగా అవమానించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు హీరోపై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన హీరో అఖిల్ రాజ్.. నెగెటివ్ కామెంట్స్ చేసే ముందు తన వైపు న్యాయాన్ని కూడా చూడాలని కోరాడు.

అసలు కారణం ఏంటంటే..

అసలు ఈ రచ్చ అంతటికీ కారణం.. అరుణ రెసిడెన్సీలో జరిగిన ఒక రాంగ్ డెలివరీ. అఖిల్ నివసిస్తున్న అరుణ రెసిడెన్సీ ఫ్లాట్ నెంబర్ 201కి ఎదురుగా ‘చేలం రెసిడెన్సీ’ అనే మరో అపార్ట్‌మెంట్ ఉంది. అందులోని ఫ్లాట్ నెంబర్ 201కి రావాల్సిన ఒక పార్సిల్‌ను డెలివరీ బాయ్ రమేశ్.. పొరపాటున అఖిల్ ఇంటి అడ్రస్‌లో ఇచ్చేసాడు. పార్సిల్‌పై అడ్రస్ స్పష్టంగా ఉన్నా.. ఓటీపీ గానీ, పేరు గానీ సరిచూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడనేది అఖిల్ వర్షన్. ఇంట్లో నలుగురు ఉండటంతో ఎవరో ఆర్డర్ చేశారనుకుని అఖిల్ తండ్రి ఆ పార్సిల్ తీసుకున్నారు. ఆ విషయం తెలియని అఖిల్ తల్లి.. వచ్చిన ప్యాకెట్‌ను ఓపెన్ చేసేశారు. తీరా ఇంట్లో ఎవరూ ఆర్డర్ చేయలేదని తెలిసి దాన్ని పక్కన పెట్టారు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత తప్పు తెలుసుకున్న డెలివరీ బాయ్ వెనక్కి వచ్చి పార్సిల్ అడిగాడు. అడ్రస్ చూసుకోవా బ్రదర్ అని అఖిల్ ప్రశ్నిస్తే.. ‘నేను చూసుకోలేదు, ఇచ్చేశానంతే’ అంటూ రమేశ్ దురుసుగా సమాధానం ఇచ్చాడనేది అఖిల్ చెబుతున్న వాదన. ఇంతలో అఖిల్ తల్లి వచ్చి.. తెలియక ఓపెన్ చేశాం బాబూ అంటూ పార్సిల్ తిరిగి ఇస్తుంటే.. ‘ఫ్రీగా వస్తే ఓపెన్ చేసి తీసుకుంటారా’ అంటూ రమేశ్ వెటకారంగా మాట్లాడాడట. ఇది కూడా అఖిల్ చెబుతున్న వర్షనే. దాంతో తల్లిని అన్న మాటలకు ఆగ్రహించిన అఖిల్.. సరిగా మాట్లాడు అంటూ హెచ్చరించాడు. ఆ డెలివరీ బాయ్ ‘నువ్వు హీరోవి కదా.. చూడు ఏం చేస్తానో’ అంటూ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడట. ఆ చిన్న వాగ్వాదమే చివరకు ఇంత పెద్ద వివాదానికి, దాడులకు దారితీసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us