పంజాగుట్టలో డిసెంబర్ 24న ప్రజాభవన్ ముందు కారుతో బారికేడ్లను ఢీ కొట్టిన ఘటనలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి ర్యాష్‌గా కారు నడిపారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్. సాహిల్‌ను తప్పించేందుకు పంజాగుట్ట పోలీసులు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై విచారణ జరిపారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. కారుతో ప్రమాదం చేసింది ఆసిఫ్‌గా ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆసీఫ్‌ను రిమాండ్ కు తరలించి విచారణ చేయాల్సిందిగా మొదట డీసీపీ ఆదేశించారు. అయితే ఆసిఫ్‌ను రిమాండ్ చేసే తరుణంలో అతని తండ్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చి గొడవ చేశాడు. తన కుమారుడు ఆసిఫ్‌కు దీంతో ఎలాంటి సంబంధం లేదని కారు ప్రమాదం చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్గా ఆరోపణలు చేశాడు. ఈ వ్యవహారం కాస్త వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ వద్దకు వెళ్ళింది. విచారణ జరిపిన ఉన్నతాధికారులు పంజాగుట్ట సీఐ దుర్గారావుపై సస్పెన్షన్ విధించారు
ఇక కట్ చేస్తే 15 రోజులుగా మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అజ్ఞాతంలోనే ఉన్నాడు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే ఫ్లైట్ ఎక్కి దుబాయికి పారిపోయి తన తండ్రి వద్ద ఉన్నాడు. అయితే అనూహ్యంగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు సాహిల్. తనకు ఈ కారు ప్రమాదంతో ఎలాంటి సంబంధము లేదని పిటీషన్లో పేర్కొన్నాడు. పోలీసులు కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని మొదట ఆసిఫ్ అనే వ్యక్తి పేరును నిందితుడిగా చేర్చి తర్వాత తన పేరును ఏ1 గా పెట్టడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆసిఫ్‌తో పోలీసుల విచారణ సమయంలో భయభ్రాంతులకు గురిచేసి తన పేరు చెప్పించేలా ఒత్తిడి తెచ్చారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు చెప్పుకొచ్చారు.
ఈ ప్రమాదంలో ఎవరి ప్రాణాలు పోలేదని, కేవలం ఒక ర్యాష్ డ్రైవింగ్ కేసును పోలీసులు అదేపనిగా హైలెట్ చేసి తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం ప్రకారం మొదట ఆసిఫ్ పేరును ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చారని సాహిల్ పిటిషన్లో ప్రశ్నించాడు. తనపై పోలీసులు కావాలనే ఈ కేసు నమోదు చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాల్సిందిగా తెలంగాణ హైకోర్టును సాహిల్ ఆశ్రయించాడు. పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..