Telangana: ఎక్కడ చూసినా అవే నోట్లు.. ఆరా తీస్తే పెద్ద డొంకే కదిలింది…

మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలను టార్గెట్‌గా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ ఇక్కడికి చేరినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం షాపులు, సూపర్ మార్కెట్లు, పెట్రోలు బంకులు, వార సంతల ద్వారా ఈ నోట్లు చలామణి అయినట్టు అనుమానం వ్యక్తమవుతోంది.

Telangana: ఎక్కడ చూసినా అవే నోట్లు.. ఆరా తీస్తే పెద్ద డొంకే కదిలింది...
Fake Currency

Edited By:

Updated on: Feb 28, 2026 | 1:08 PM

మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. వారం రోజులుగా సూపర్ మార్కెట్లు , మధ్యం షాపులు , కిరాణ దుకాణాల్లో వరుసగా దొంగ నోట్లు రావడం సంచలనంగా మారింది. మద్యం షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి‌ దిగిన పోలీసులు విచారణ చేపట్టడంతో డొంకంతా కదిలింది. మున్సిపాలిటీ ఎన్నికలే టార్గెట్‌గా భారీ మొత్తంలో నకిలీ నోట్లు లక్షేట్టిపేట మున్సిపాలిటీలోకి డంప్ అయినట్టుగా గుర్తించిన పోలీసులు 20 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎంత మొత్తంలో వచ్చాయి.. మార్కెట్‌లో ఎన్ని చలామణిలో ఉన్నాయి.. ఈ దందా వెనుకున్న కింగ్ పిన్ ఎవరు అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. అనుమానితుల్లో ముగ్గురుని కీలక నిందితులుగా గుర్తించిన పోలీసులు కీలక ఆధారాలను రాబట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నుంచి పెద్ద మొత్తంలో దొంగ నోట్లు లక్షేట్టిపేట మండలానికి చేరుకున్నట్టు గుర్తించారు పోలీసులు. లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాలకు చెందిన ఓ ఇద్దరు, లక్షేట్టిపేట మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ బేకరి నిర్వాహకుడు, రంగపేట గ్రామానికి చెందిన మరో వ్యాపారితో చేతులు కలిపి ఈ దొంగ నోట్లను లక్షేట్టిపేట మండలంలో చెలామణి చేసినట్టు గుర్తించారు పోలీసులు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చివరి రోజు ఈ దొంగ నోట్లనే ఓటర్లకు పంపినట్టు తేలింది. అలా ఓటర్లకు చేరిన దొంగ నోట్లు మద్యం దుకాణాలు, పెట్రోలు బంకులు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, హోల్‌సేల్ దుకాణాల ద్వారా మార్కెట్‌లోకి చేరినట్టు సమాచారం. ఆదివారం, గురువారం జరిగే వార సంతల్లో వీటి చెలామణి పెద్ద మొత్తంలో జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు

లక్షెట్టిపేటలోని ఓ మద్యం దుకాణంలో ఈ నెల 22న నాలుగు నకిలీ నోట్లు రాగా, ఈనెల 25 న ఓ సూపర్ మార్కెట్‌లో రెండు 500 రూపాయల దొంగ నోట్లు రావడం.. అదే రోజు మరో మద్యం షాపులో ఏకంగా పది దొంగ నోట్లు రావడం సంచలనంగా మారింది. లక్షేట్టిపేట మార్కెట్‌లో దొంగ నోట్లు భారీగా చెలామణి అవడంతో ప్రజల్లో, వ్యాపారస్తుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

ఓ వైపు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెడుతున్నా దొంగనోట్ల ముఠాలు మాత్రం ఆగడం లేదు. సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, నకిలీ కరెన్సీని మార్కెట్‌లో యథేచ్ఛగా చెలామణి చేస్తూ ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయి. గత పదేళ్ల క్రితం వరకు లక్షేట్టిపేట దొంగ నోట్ల దందాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవగా.. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ దందా ఆగిపోయింది. తాజాగా మరొసారి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు మార్కెట్లోకి రావడం సంచలనంగా మారింది.

Also Read: ఇంటర్ పరీక్షలు రాస్తూ.. పరీక్షా కేంద్రంలోని వాష్ రూమ్‌లో ప్రసవించిన బాలిక 

 

Follow Us