Telangana: కులగణనపై ప్రభుత్వానికి నిపుణుల కమిటీ రిపోర్ట్… నివేదికలో ఏమేమి అంశాలు ఉన్నాయంటే…
కులగణన సర్వేపై తెలంగాణ ప్రభుత్వానికి నిపుణుల కమిటీ కీలక రిపోర్ట్ అందజేసింది. వివిధ అంశాల వారీగా సర్వే వివరాలను సమగ్రంగా విశ్లేషించి 300 పేజీల నివేదికను సమర్పించింది. తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్‌గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అటు.. వెనుకబాటుతనంలో అర్బన్, రూరల్ ఏరియాల మధ్య...

కులగణన సర్వేపై తెలంగాణ ప్రభుత్వానికి నిపుణుల కమిటీ కీలక రిపోర్ట్ అందజేసింది. వివిధ అంశాల వారీగా సర్వే వివరాలను సమగ్రంగా విశ్లేషించి 300 పేజీల నివేదికను సమర్పించింది. తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్‌గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అటు.. వెనుకబాటుతనంలో అర్బన్, రూరల్ ఏరియాల మధ్య వ్యత్యాసాలకు కారణాలపై అధ్యయనం చేయాలని రేవంత్ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఆదేశించింది.
హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్‌రెడ్డితో కులగణన అధ్యయనంపై ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో నిపుణుల కమిటీ ఛైర్మన్, రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్యతోపాటు 11మంది కమిటీ సభ్యులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. 300పేజీల నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది నిపుణుల కమిటీ. ఈ సర్వే సైంటిఫిక్ అని నిరూపితమైందని పేర్కొంది. తెలంగాణ నిర్వహించిన సర్వే చరిత్రాత్మకమని, దేశానికి రోల్ మోడల్‌గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.
కులాల వారీగా వెనుకబాటుతనాన్ని విశ్లేషించిన కమిటీ.. కొత్త పాలసీలతో పాటు ప్రస్తుత విధానాలను మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలను నివేదికలో పొందుపర్చింది. ఈ సందర్భంగా.. తెలంగాణలో జరిగిన కులగణన కేవలం డేటా సేకరణ కాదని.. ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్‌గా సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. రాహుల్ మాట ప్రకారం కులగణన చేశామని.. తెలంగాణలోని బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయం అమలు చేసేందుకు కులగణన ఉపయోగపడుతుందన్నారు. వెనుకబాటుతనంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడాలు, వాటి కారణాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని.. వాటి ఆధారంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ఇక.. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించింది. మొదటి దశలో గతేడాది నవంబర్, డిసెంబర్‌లో 50 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా సర్వే చేపట్టింది. తెలంగాణలోని మొత్తం జనాభాకు చెందిన సమాచారం సేకరించింది. లక్షా 3వేల 889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లతో సర్వే చేయించింది. ఫస్ట్ ఫేజ్‌లో తెలంగాణలోని 96.9 శాతం కుటుంబాల సర్వే నిర్వహించి వారి వివరాలను 36 రోజుల్లోనే డేటా ఎంట్రీ చేయించింది. అలాగే.. మొదటి దశలో వేర్వేరు కారణాలతో సర్వే మిస్ అయిన వారి వివరాల నమోదుకు రెండో విడతలో అవకాశం కల్పించింది.
రెండు దశల్లో వచ్చిన కులగణన సర్వే వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎస్సీలు 61,91,294 మంది (17.42%), ఎస్టీలు 37,08,408 మంది (10.43%), బీసీలు 2,00,37,668 మంది (56.36%), ఇతర కులాల వారు 56,13,389 మంది (15.89%) మంది ఉన్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే.. 11మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయగా.. పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. సర్వే వివరాలను సమగ్రంగా విశ్లేషించి.. రేవంత్ ప్రభుత్వానికి డిటేయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తంగా.. తెలంగాణ కులగణనపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి కీలక నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్‌లోని అంశాలు, సూచనలను కేబినెట్‌లో చర్చించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది.




