Q by Tonique: తవ్వేకొద్దీ బయటపడుతున్న క్యూ బై టానిక్ అక్రమాలు.. అధికారుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు!
టెండర్లు లేవు.. లక్కీ డ్రాలు లేవు.. ఒకే ఒక్క జీవోతో పర్మినెంట్ లైసెన్స్ కొట్టేసిన టానిక్ యజమాన్యం ఎడాపెడా మద్యం విక్రయాలు జరిపింది. ట్యాక్స్‌లు ఎగ్గొట్టి.. వందల కోట్ల రూపాయలు దారి మళ్లించి ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టింది. ప్రాథమిక విచారణలోనే అంతులేని అక్రమాలు బయటపడ్డాయి. ఇక పూర్తిస్థాయిలో తీగలాగితే..? ఈ ప్రశ్నే టానిక్ నిర్వాహకుల గుండెల్లో దడ పుట్టిస్తోంది.
టెండర్లు లేవు.. లక్కీ డ్రాలు లేవు.. ఒకే ఒక్క జీవోతో పర్మినెంట్ లైసెన్స్ కొట్టేసిన టానిక్ యజమాన్యం ఎడాపెడా మద్యం విక్రయాలు జరిపింది. ట్యాక్స్‌లు ఎగ్గొట్టి.. వందల కోట్ల రూపాయలు దారి మళ్లించి ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టింది. ప్రాథమిక విచారణలోనే అంతులేని అక్రమాలు బయటపడ్డాయి. ఇక పూర్తిస్థాయిలో తీగలాగితే..? ఈ ప్రశ్నే టానిక్ నిర్వాహకుల గుండెల్లో దడ పుట్టిస్తోంది.
క్యూ బై టానిక్ వైన్ మార్ట్ పేరుతో జరిగిన అక్రమాల డొంక ఒక్కొక్కటిగా బయటపడుతోంది. చాలా ఈజీగా అనుమతులు పొందడం దగ్గర్నుంచి ట్యాక్స్‌ల ఎగవేత వరకు అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ యజమాన్యానికి గత ప్రభుత్వ హయాంలోని కొంతమంది నేతలు, అధికారులు పూర్తిగా సహకారం అందించినట్టు దర్యాప్తులో వెల్లడవుతోంది.
ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మినెంట్ లైసెన్స్‌ను 2016లో ప్రత్యేక జీవో 271ను గత ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేసుకుని వెసులుబాటు ఇచ్చారు. మొదటి మూడు సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజు చెల్లించకుండా అవకాశం కల్పించారు. ఎలైట్ వైన్ షాపు కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. టానిక్ బేవరేజెస్ మాత్రమే టెండర్ కోట్ చేసింది. దీంతో టానిక్‌కు ఎలైట్ వైన్ షాప్ పర్మినెంట్ అనుమతి సులువైంది. తెలంగాణలో ఒక్క ఎలైట్ ఔట్ లెట్‌కి మాత్రమే అనుమతివ్వగా.. హైదరాబాద్ నగర శివారుల్లో మరో 10 ఎలైట్ వైన్ షాపులను క్యూ బై టానిక్ పేరుతో నిర్వహిస్తోంది.
లైసెన్స్ ప్రకారం లిక్కర్ బాటిల్స్ మాత్రమే విక్రయించాలి. లూజ్ వైన్‌కి పర్మిషన్ లేదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా సాధారణ మద్యం లైసెన్స్ తీసుకుని ఫారిన్ లిక్కర్ అమ్మకాలు జరిపింది. రిటైల్‌గా ఫారిన్ లిక్కర్‌తో పాటు ప్రీమియం ఇండియన్ లిక్కర్ అమ్మకాలు కూడా దర్జాగా చేపట్టింది. టానిక్ మెయిన్ బ్రాంచీలో పనిచేసే ఓ ఉద్యోగి పేరుతో ఫారిన్ లిక్కర్ లైసెన్స్ తీసుకుని అన్ని ప్రాంఛైజీల్లో అమ్మకాలు కొనసాగించింది. ఆరేళ్లుగా ట్యాక్స్‌లు చెల్లించకుండా సర్కారు ఖజానాకు వంద కోట్ల రూపాయలు ఎగ్గొట్టినా అధికారులెవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. కారణం.. నిర్వాహకుల వెనుక రాజకీయ నేతలు ఉండడమేనని తెలుస్తోంది.
తవ్వేకొద్దీ క్యూ బై టానిక్ అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొంపల్లిలో ఎక్సైజ్ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వైన్స్ లైసెన్స్ పేరుతో క్యూ బై టానిక్ ఔట్‌లెట్ నిర్వహిస్తోంది. వాక్ ఇన్ కోసం ఏకంగా 5లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో ఫారిన్ లిక్కర్ కూడా బయటపడింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్.. లైసెన్స్ స్టాక్ ఆర్డర్స్ రికార్డ్‌లను పరిశీలించారు. అయితే నిర్వాహకులు చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితికి ఎక్కడా పొంతనలేనట్టు గుర్తించారు.
అక్రమాలు బయటకు రావడంతో ఎక్సైజ్ శాఖ చర్యలకు దిగింది. ప్రత్యేక జీవోతో అర్ధరాత్రి 2 గంటల దాకా లిక్కర్ అమ్ముకునే వెసులుబాటును తొలగించింది. రెగ్యులర్ లిక్కర్ షాపుల్లాగే రాత్రి 11గంటల వరకే అమ్ముకోవాలని సూచించింది. పన్నుల ఎగవేతపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చాకే ఈ నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…