హీరాగోల్డ్ గ్రూప్ తిన్నదంతా కక్కించే పనిలో ఈడీ.. రూ. 428 కోట్ల ఆస్తులు అటాచ్
మాటలు చెప్పి జనాన్ని ముంచేసింది. అడిగినవారిని బెదిరించింది. బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టింది. జైలుకెళ్లినా బయటికొచ్చి దర్జాగా బతకొచ్చని అనుకుంది. కానీ జనం ఉసురు పోసుకున్న ఆ మహాతల్లిని నిలబెట్టి వేలం వేస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ. వేలాదిమందిని డిపాజిట్ల పేరుతో మోసగించిన నౌహీర్ షేక్ ఆస్తుల ఆక్షన్ మొదలైంది. అమాయకులను బుట్టలో వేసుకుని హీరాగోల్డ్ గ్రూప్ తిన్నదంతా కక్కించే పనిలో ఉంది ఈడీ.

మాటలు చెప్పి జనాన్ని ముంచేసింది. అడిగినవారిని బెదిరించింది. బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టింది. జైలుకెళ్లినా బయటికొచ్చి దర్జాగా బతకొచ్చని అనుకుంది. కానీ జనం ఉసురు పోసుకున్న ఆ మహాతల్లిని నిలబెట్టి వేలం వేస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ. వేలాదిమందిని డిపాజిట్ల పేరుతో మోసగించిన నౌహీర్ షేక్ ఆస్తుల ఆక్షన్ మొదలైంది. అమాయకులను బుట్టలో వేసుకుని హీరాగోల్డ్ గ్రూప్ తిన్నదంతా కక్కించే పనిలో ఉంది ఈడీ.
జనాన్ని ముంచడం, తర్వాత చేతులెత్తేయడం ఘరానా మోసగాళ్లకు అలవాటైపోయింది. మహా అయితే నాలుగు రోజులు జైలుకు వెళ్లొస్తామని దేనికైనా తెగబడేవాళ్లు ఎక్కువైపోయారు. తెలంగాణ కేంద్రంగా దేశవ్యాప్తంగా ఎందరికో టోపీ వేసిన నౌహీరా షేక్ కూడా అదే బాపతు. కానీ జైలుతో సరిపెట్టలేదు కేంద్ర దర్యాప్తు సంస్థ. జనం సొమ్మును ముక్కుపిండి వసూలు చేసే పనిలో ఉంది. ఆస్తులు అటాచ్ చేయడమే కాదు.. ఆక్షన్ కూడా వేస్తోంది.
హీరా గ్రూప్ పేరుతో వేలాది మందిని ముంచేసిన నౌహీరా షేక్‌కి చెందిన 19కోట్ల 64 లక్షల విలువచేసే ఆస్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేలం వేసింది. కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో దగ్గరుండి ప్రక్రియ పూర్తి చేసింది. దర్యాప్తులో నౌహీరా షేక్‌కి చెందిన 428 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరికొన్ని ఆస్తులకు త్వరలోనే వేలం నిర్వహిస్తామని, వచ్చిన సొమ్ముని మోసపోయిన బాధితులకు అందేలా చూస్తామంటోంది.
దేశవ్యాప్తంగా డిపాజిట్ల పేరుతో హీరా గ్రూప్ ద్వారా 5వేల 978 కోట్ల రూపాయలు సేకరించింది నౌహీరా షేక్. సంవత్సరానికి 36శాతం లాభాల ఆశచూపి అందరినీ మోసగించింది. డిపాజిట్లతో వచ్చిన డబ్బుతో భారీగా అక్రమాస్తులను కూడబెట్టింది. బంధువులు, బినామీల పేర్ల మీద ఆస్తులు కొనుగోలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలను మోసం చేశారన్న ఫిర్యాదులపై నౌహీరా షేక్‌పై కేసు నమోదైంది. హీరా గోల్డ్ కుంభకోణంతో దాదాపు లక్షా 72 వేల మంది ఇన్వెస్టర్లు మోసపోయినట్లు అంచనా. నౌహీరా షేక్‌పై దేశవ్యాప్తంగా 52కు పైగా కేసులు నమోదయ్యాయి. మనీలాండరింగ్ కేసులో 2018 అక్టోబర్ 16న నౌహీరాను అరెస్టు చేశారు.
నౌహిరా షేక్, ఇతరులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు రాష్ట్రాల పోలీసు శాఖలు నమోదు చేసిన అనేక ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టింది. బాధితులకు నష్టపరిహారం అందించేందుకు అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయాలని ఈడీ సుప్రీం కోర్టులో విజ్ఞప్తి చేసింది. అనుమతి లభించడంతో MSTC ద్వారా పలు ఆస్తులను వేలం వేశారు. ఆక్షన్‌లో పాల్గొంటున్న వారిపై నౌహీరా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఈడీ అధికారులు కొన్నాళ్లక్రితం సుప్రీంని ఆశ్రయించారు.
జనాన్ని నిలువునా దోచుకున్న నౌహీరా షేక్ తన పేరుతో కేవలం మూడు ఆస్తులే ఉన్నాయని బుకాయిస్తోంది. ఆస్తుల ఆక్షన్ మొదలుకావటంతో హీరా దోచుకున్న సొమ్ములో కొంతయినా రికవరీ అవుతుందనే ఆశతో ఉన్నారు బాధితులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
