ఎన్నికల వేళ.. కళ్యాణ వైభోగమేలా.. నగదు, ఆభరణాల రవాణాకు ఎన్నికల కోడ్ కష్టాలు

| Edited By: Jyothi Gadda

Nov 14, 2023 | 8:24 AM

కల్యాణమండపం, డెకరేషన్స్, ఈవెంట్ నిర్వాహకులకు డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే అధికారులు మాత్రం ఆధారాలు చూపితేనే వదిలేస్తామని చెబుతూనే.. తాజాగా సీజ్ అయిన సామాన్యుల నగదు ఇప్పటికీ చేతికి అందక పోవడంతో శుభకార్యం ఎలా చేయలో తెలియక అష్టకష్టాలు పడుతున్నారు. అందుకే ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందంటే ఇదేనేమో.

ఎన్నికల వేళ.. కళ్యాణ వైభోగమేలా.. నగదు, ఆభరణాల రవాణాకు ఎన్నికల కోడ్ కష్టాలు
Election Code
Follow us on

ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందంటే ఇదేనేమో..!అన్నట్టుగా మారింది.. తెలంగాణలో లగ్గాల ముచ్చట.. కార్తీకమాసంలో పెళ్లి మూహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఈ సారి అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా, మూడు ముళ్లతో ఒక్కటవ్వాలనుకున్న జంటల పరిస్థితి గందరగోళంగా మారింది. ముహుర్తం ముంచుకొస్తున్నా పెళ్లికి కావాల్సిన సామాగ్రి ఇప్పటికే కొనుగోలు చేయాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ అడుగడుగునా అడ్డుపడుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ప్రజలకు అష్టకష్టాలు తప్పడం లేదు. కట్నకానుకాల మాట దేవుడెరుగు కనీసం పెళ్లి బట్టలు కొనుగోలు చేసి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నగలు, నట్రా కొనుగోలు చేయాలంటే కోడ్ అడ్డు వస్తుండటంతో తూతూ మంత్రంగా పెళ్లి చేయలేక వరుడి కుటుంబ సభ్యులు పెట్టే కండిషన్లను తూచా తప్పకుండా పాటించే పరిస్థితి లేక నరకం చూస్తున్నారంట వధువు కుటుంబీకులు. అటు మగపెళ్లి వారిది అదే సమస్య. రిసెప్షన్ కు పంక్షన్ హాల్లు బుక్ చేసుకుందామంటే అప్పటికే నేతలు తమ రాజకీయ సభల కోసం బుక్ చేసుకోవడం.. వంట మనుషులను సైతం వారం ముందే హోల్డ్ చేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారంట పెళ్లి వారు.

ఈ నెల 16 నుంచి శుభముహూర్తాలుండటంతో ఉమ్మడి జిల్లాలో వందలాది వివాహాలు జరుగనున్నాయి. పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు నెల రోజుల ముందే ఏర్పాట్లు చేసుకున్నా, నేతల బహిరంగ సభలతో ఫంక్షన్ హాల్లు, టెంట్లు, వంట మనుషులు చివరికి మినరల్ వాటర్ కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో శుభకార్యం వాయిదా వేసుకోలేక, సింపుల్‌గా పెళ్లి తంతు జరపలేక నానా ఇబ్బందులు పడుతున్నారంట పెళ్లి వారు. హంగూ ఆర్భాటాలతో మూడు నుంచి ఐదు రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని ముందస్తుగా ప్రణాళిక రచించుకున్న పెళ్లి వారు.. ఒక్క రోజుతో పెళ్లి వేడుకను ముగించుకోక తప్పడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతుండటం.. ఉమ్మడి ఆదిలాబాద్ పక్కనే మహారాష్ట్ర సరిహద్దు ఉండటం.. పెళ్లి బట్టలకు, నిత్యవసర సరుకులకు సరిహద్దు దాటి వెళ్లాల్సి రావడం.. పెళ్లి ముహుర్తాలతో బందు గణమంతా సరిహద్దు దాటి రావాల్సి ఉండటం.. పెళ్లిలకు వస్తున్న వారంత భారీగానే నగలు, నగదుతో వస్తుండటంతో రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద తనిఖీల్లో లెక్కలు చెప్పలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కోడ్ అమలు ఉండటంతో 50 వేలకు మించి నగదు తీసుకెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితి నెలకొనడంతో పక్క జిల్లాలకు వెళ్లి పెళ్లికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి జిల్లాకు తీసుకురావాలంటే మూడు చెరువుల‌ నీళ్లు తాగినంత పనవుతుందని ఆవేదన చెందుతున్నారు పెళ్లి వారు.
మరోవైపు
వంట మనుషులకు కూడా డిమాండ్ పెరగడంతో లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఇవ్వాల్సి వస్తుంది.. అడ్వాన్స్ ఇస్తేనే వంట వాళ్లు వచ్చే పరిస్థితి ఉండటంతో అంతా గూగుల్ పే, ఫోన్ ఫేలోనే కానిచ్చేస్తున్నారంట. వంట సామాన్లకు‌ ఏకంగా 5లక్షల పైనే ఖర్చు అవుతుండటంతో అంత మొత్తం తరలించలేక ఆన్ లైన్ లో పంపలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. కల్యాణమండపం, డెకరేషన్స్, ఈవెంట్ నిర్వాహకులకు డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే అధికారులు మాత్రం ఆధారాలు చూపితేనే వదిలేస్తామని చెబుతూనే.. తాజాగా సీజ్ అయిన సామాన్యుల నగదు ఇప్పటికీ చేతికి అందక పోవడంతో శుభకార్యం ఎలా చేయలో తెలియక అష్టకష్టాలు పడుతున్నారు. అందుకే ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందంటే ఇదేనేమో.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..