
హైదరాబాద్, నవంబర్ 21: ఎన్నికలకు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ప్రతిరోజు కోట్ల కట్టలు బహిరంగంగానే దర్శనమిస్తున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యధికంగా డబ్బు పట్టుబడుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే. ఇన్ని నిఘా సంస్థలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఎలక్షన్ సిబ్బంది ఉన్నా.. అన్ని కోట్ల రూపాయలను ఓటర్లకు చేర్చగలుగుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది ఓటర్‌కు తన నోటును దగ్గరికి చేర్చే పనిలోపడ్డారు అభ్యర్థులు. మొత్తం 119 నియోజకవర్గాలకు చెందిన ఓటర్లకు తన ఓటు కోసం నోటును పంచే ప్రయత్నంలో పడ్డారు అభ్యర్థులు. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ నగదును కట్టడి చేసేందుకు దాదాపు 228 మంది అధికారులను ఎలక్షన్ కమిషన్ నియమించింది. అయితే ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే ఓటర్‌కు తమ నోటును చేర్చి తీరుతామంటున్నారు అభ్యర్థులు. ఇందులో భాగంగా ప్రతిరోజు తెలంగాణలో ఎక్కడో చోట కోట్ల కట్టలు బయట పడుతూనే ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పోలిస్తే అత్యధికంగా తెలంగాణలోనే ఎక్కువగా నగదు పట్టుబడినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో పట్టుబడిన డబ్బులో 60 శాతానికి పైగా తెలంగాణలోనే పట్టుబడింది.
ఐదు రాష్ట్రాలు కలిపి మొత్తంగా రూ. 1760 కోట్ల విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 659 కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణలోనే దొరికింది. తెలంగాణ తర్వాత రాజస్థాన్‌లో 650 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి పట్టుబడిన నగదు విలువ రూ. 372 కోట్లు కాగా.. ఒక్క తెలంగాణలోనే రూ. 225 కోట్ల రూపాయలు దొరికాయి. వీటితో పాటు ఓటర్లను ఆకర్షించేందుకు మద్యం, చీరలు, గిఫ్ట్‌లు కూడా అత్యధికంగా తెలంగాణలోనే పట్టుబడ్డాయి. అయితే 2018లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పోలిస్తే 636 శాతం అధికంగా ఎన్నికల సొత్తును ఈసారి పట్టుకున్నారు.
రూట్ ఏదైనా సరే ఓటర్‌కు డబ్బు చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి పార్టీలు. అయితే ఎన్నికలకు కొద్ది నెలల ముందే నియోజకవర్గాల్లో ఉన్న రైస్ మిల్లులు, గోడౌన్లు , సినిమా హాళ్లు, రేషన్ షాపులలో నగదును డంపు చేశారు. రెండు విడతలుగా డబ్బు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు అభ్యర్థులు. ఒక్కో నియోజకవర్గాన్ని బట్టి ఓటుకు వెయ్యి రూపాయల నుంచి 5000 వరకు పంచుతున్నారు. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు రెండో విడతలో డబ్బులు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. ఎలక్షన్ ముందు రోజు జరిగే పోల్ మేనేజ్‌మెంట్‌ను 10 రోజులు ముందు నుంచే పార్టీలు మొదలుపెట్టాయి. మన రాష్ట్రంలో దాదాపు లక్ష మంది పోలీసులు ఇప్పుడు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఇంతమంది పగడ్బందీగా వ్యవహరిస్తున్నా.. చాప కింద నీరులా నగదు పంపిణీ జరుగుతూనే ఉంది. మారుమూల గ్రామాల నుంచి మొదలు పెట్టి సిటీలో ఉండే గ్రేటెడ్ కమ్యూనిటీల దాకా అందరితో గెట్ టు గేదర్‌లు, బహిరంగంగా దావతులు.. ప్రతి పార్టీలో ఎక్కువ ఓటర్లకు గిఫ్ట్ ప్యాకులు. ఇప్పుడు పార్టీలన్నీ ఇదే ట్రెండును అనుసరిస్తున్నాయి.
ఎలక్షన్ దగ్గరపడుతున్న కొద్దీ ఓటర్లకు డబ్బులు పంచేందుకు పక్క రాష్ట్రాల నుంచి సంచులు దిగుతున్నాయి. ఎలక్షన్ కోసం ఒక్కో లీడర్ కనీసం సంవత్సరం ముందే నగదు మొత్తాన్ని పోగు చేసుకుంటారు. ఇప్పుడు పట్టుబడుతున్న కోట్ల కట్టలు అన్నీ ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నవే. మరోవైపు అభ్యర్థికి సంబంధించిన కాలేజీలు, ఐటీ కంపెనీలలో ముందుగానే డబ్బు నిల్వ చేసి ఉంచారు. కొద్దిరోజుల క్రితం మొయినాబాద్‌లో పట్టుబడిన రూ. 7.5 కోట్లు శ్రీనిధి కాలేజ్ చైర్మన్ ఫార్మ్ హౌస్ నుంచి వచ్చాయి. ఇవి ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన డబ్బులుగా తేల్చారు. తాజాగా చెన్నూరు అభ్యర్థి వివేక్‌కు చెందిన రూ. 8 కోట్లను బయటికి రాకుండా బ్యాంక్‌లోనే ఫ్రీజ్ చేశారు అధికారులు. ఈ వ్యవహారంపై పోలీసులు సైతం కేసు రిజిస్టర్ చేశారు. ఏదేమైనా సరే ఓటర్‌కు డబ్బు చేరితేనే ఓటు వేస్తాడనే ధోరణి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓటుకు నోటే అస్త్రంగా బరిలో ఉన్న అభ్యర్థులు భావిస్తున్నారు. మరి అభ్యర్థి భావించినట్టు నోటుతో ఓటర్ లొంగుతాడా.? ఓటుతో బుద్ధి చెబుతాడా.?? అనేది చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..