పద్మభూషణ్ అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగింది.. చిన్న జీయర్ స్వామి స్పందన..

ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆచార్యుడు..ఈ తరానికి సమతామూర్తి.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డును స్వీకరించారు.

పద్మభూషణ్ అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగింది.. చిన్న జీయర్ స్వామి స్పందన..
Chinna Jeeyar Swamy
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 06, 2023 | 7:17 AM

ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆచార్యుడు..ఈ తరానికి సమతామూర్తి.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమం అనంతరం మాట్లాడారు చినజీయర్ స్వామి.

వికాస్ తరంగిణి, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసిందన్నారు చిన్న జీయర్ స్వామి. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే ఈ అవార్డు అని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, స్పందించి, అందించే సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ‘‘స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ’’ నినాదాన్ని తాము తీసుకొచ్చామన్నారు. ఎవరు ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని ఆచరించినా సరే సామాజిక సేవ విషయంలో అందరం కలసి పనిచేయాలన్నదే ఈ నినాదం లక్ష్యం అన్నారు. స్వధర్మాన్ని ఆచరిస్తూ, ఇతర ధర్మాలను ఆదరిస్తూ కుల, మత, ప్రాంత, లింగ బేధాలు లేకుండా సేవ చేయాలన్నదే తమ ఉద్దేశం అన్నారు చిన్న జీయర్ స్వామి. ప్రకృతి కన్నెర్ర చేయడం ఉండదని, కానీ వైపరీత్యాలకు మనిషిలోని అత్యాశే కారణం పేర్కొన్నారాయ. ఒక జంతువు మరో జంతువును అవసరానికే చంపుతుందని, మనిషి మాత్రం అత్యాశతో ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నాడని ఆందోళన వెలిబుచ్చారు. మానవ సేవయే మాధవ సేవ అనే మాటను ‘‘సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ’’గా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ‘భగవంతుడు గుడికి, గుండెకు మాత్రమే పరిమితం కాడు, భగవంతుడు సర్వాంతర్యామి. ప్రపంచమే ఆయన శరీరం. ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా భగవంతుడి శరీరానికి హాని కలిగినట్టుగా భావించి, మనం సేవ చేయాలి.’ అని పేర్కొన్నారు చిన్న జీయర్ స్వామి.

ఇక మహిళలకు గర్భకోశ క్యాన్సర్ల విషయంలో వికాస తరంగిణి ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్, నేపాల్‌లో సుమారు 20 లక్షల మంది మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి, 6-7 లక్షల మందికి చికిత్స అందించామని వివరించారు. పద్మభూషణ్ అవార్డు ద్వారా మనం చేసే సేవా కార్యక్రమాలపై బాధ్యత, జవాబుదారీతనం మరింత పెరిగిందన్నారు. మరింత మెరుగ్గా, నేర్పరితనంతో సామాజిక అవసరాలను గుర్తించి, స్పందించడం బాధ్యతగా భావించాలన్నారు.

ఇవి కూడా చదవండి

చిన్న జీయర్ స్వామి విశిష్టతలు తెలుసుకుందాం..

అణువణువునా ఆధ్యాత్మికత.. ఎటుచూసినా సమతా భావన..! 216 అడుగుల భవ్యమైన సమతామూర్తి విగ్రహం.. దాని చుట్టూ 108 దివ్య క్షేత్రాలతో అలరారుతోంది ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం! 216 ఎత్తుల రామానుజుల స‌మతా మూర్తి భ‌వ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయ‌డం వెనుక ప‌ర‌మోద్దేశం.. రామానుజ స‌మతా స్ఫూర్తిని ప‌రివ్యాప్తం చేయ‌డం. ఉత్తమ సంస్కారాలను, సంస్కృతిని భావిత‌రాల‌కు అందించేందుకు అవిరళ కృషి చేస్తున్నారు చినజీయర్‌స్వామి.

23 ఏళ్ల వయస్సులో సన్యాసం స్వీకరణ..

23 ఏళ్ల వయస్సులోనే సన్యాసాన్ని స్వీకరించిన చినజీయర్‌స్వామిజీ..1984లో వేద విద్య, ఆగమ శాస్త్రాలు నేర్పించే జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ను స్థాపించారు. శంషాబాద్‌ సమీపంలో ముచ్చింతలో జిమ్స్‌ ఆస్పత్రి స్థాపించి ఉచిత వైద్యం అందిస్తున్నారు.విద్య అనేది ఒక వర్గానికో, వర్ణానికో కాక, మానవాళికంతటికి అందాలనే ఉద్దేశంతో ఆ వేద పాఠశాలలనే గురుకుల పాఠశాలలుగా మలచి, అన్ని రకాల విద్యలనీ బోధించే సౌకర్యాన్ని కల్పించారు. ఈ మహా సంక‌ల్ప సాకారంలో ఎన్నెన్నో ఒడిదొడుకులొచ్చినా వేటికీ చ‌లించ‌కుండా..లోక క‌ల్యాణం కోసం ఇల వైకుంఠ‌పురాన్ని సాక్షాత్కారింపజేసి ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వామిజీగా తనదైన ముద్రవేశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక రంగంలో చేసిన విశేషకృషికి గానూ.. చినజీయర్‌స్వామికి ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌లో కనులవిందుగా, వేడుకగా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో శ్రీ శ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

మొత్తానికి సమతా సందేశం విశ్వమానవాళికి శాంతి వీచిక కావాలనే సంకల్పంతో..రామానుజ త‌త్వాన్ని విశ్వవ్యాప్తం చేసేలా త‌ప‌స్సు చేప‌ట్టారు శ్రీచిన్న జీయ‌ర్ స్వామి. ఈ ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్‌ అవార్డుతో ఆధ్యాత్మిక సేవలకు అసలైన గుర్తింపు లభించినట్లైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..