VLF Radar Station: దేశ భద్రత వేరు.. రాజకీయాలు వేరు.. నేవీ రాడార్ సెంటర్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ శంకుస్థాపన..
రాడార్‌పై రాజకీయాలొద్దు. దేశ భద్రత వేరు.. రాజకీయాలు వేరు. ఇవీ దామగుండం నేవీ రాడార్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో ఉపయోగమన్న రాజ్‌నాథ్.. రాడార్ స్టేషన్ నిర్మాణంలో నేవీకి పూర్తిగా సహకరిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
భారత నేవీకి చెందిన VLF కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్ రాడార్ సెంటర్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎంపీలు, పలువురు నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీపబోమని.. రాడార్ స్టేషన్ నిర్మాణంలో నేవీకి పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. రాడార్ స్టేషన్ నిర్మాణంతో ఎవరికీ నష్టం లేదన్నారు. నేవీ రాడార్ స్టేషన్ దేశానికి ఎంతో ప్రయోజనకరమని.. కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత బలంగా మారుతుందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పర్యావరణానికి ఎలాంటి నష్టం లేదన్నారు.
దామగుండం వివాదంపై స్పందించిన సీఎం రేవంత్
పర్యావరణానికి వ్యతిరేకమంటూ దామగుండంలో నేవీ రాడార్ సెంటర్‌ను బీఆర్ఎస్ సహా పలు సంఘాలు వ్యతిరేకిస్తుండటంతో.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. దేశ రక్షణ విషయంలో రాజీపడబోమన్నారు సీఎం రేవంత్. దేశ రక్షణ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని.. తెలంగాణ రాష్ట్రానికి ఇది మరో ముందడుగని తెలిపారు. దామగుండంపై చాలా మంది వివాదాలు చేయాలని చూశారన్న సీఎం రేవంత్.. రాడార్ స్టేషన్ నిర్మాణంతో ఎవరికీ నష్టం లేదన్నారు. తమిళనాడులో 34 ఏళ్లుగా రాడార్ స్టేషన్ ఉన్నా ఎలాంటి నష్టం జరగలేదని గుర్తు చేశారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
నేవీ రాడార్ స్టేషన్ దేశానికి ఎంతో ప్రయోజనకరం- రాజ్‌నాథ్
ఈ ప్రాజెక్ట్ మన దేశానికి అత్యంత ఉపయోగకరమైనదన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కృషి చేసిన తెలంగాణ సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశం భద్రత వేరు.. రాజకీయాలు వేరు అని స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం ఈ రకమైన స్టేషన్లు అత్యంత ముఖ్యమైనవని రాజ్‌నాథ్ తెలిపారు.
రాడార్ స్టేషన్ నిర్మాణానికి 2,900 ఎకరాల అటవీ భూమి
ఈ నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి అటవీ శాఖకు చెందిన 2,900 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావెల్ కమాండ్‌కు ఆరు నెలల క్రితమే అప్పగించింది. కొత్త వీఎల్‌ఎఫ్ కేంద్రాన్ని 2027 లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..