ప్రతి తండ్రి తన అంతిమ సంస్కారాలు చేసేందుకు కొడుకును వారసుడిగా కోరుకుంటాడు. అయితే.. కొడుకు కంటే కూతురేం తక్కువ కాదంటూ.. కూతురే కొడుకై తండ్రికి తల కొరివి పెట్టింది ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ. తండ్రికి తలకొరివి పెట్టి ప్రశంసలు అందుకుంటోంది. ప్రపంచమంతా టెక్నాలజీలో జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తున్నా సమాజంలో స్త్రీ, పురుష బేధభావాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు.. ఉద్యోగం.. టెక్నాలజీలో పురుషులకు ధీటుగా దూసుకుపోతున్నా.. పితృకర్మల విషయాల్లో స్త్రీలపై ఆంక్షలు అలాగే ఉన్నాయి. తల్లిదండ్రులు చనిపోతే కొడుకులే కర్మలు చేయాలి.. ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహిస్తారు. కానీ.. ఇప్పుడు.. కొంతమంది మహిళల్లో మార్పులొస్తున్నాయి. అలాంటి కట్టుబాట్లకు చెక్ పెడుతున్నారు. మగపిల్లలను కన్నట్లుగానే ఆడపిల్లలను కన్నారు.. అలాంటప్పుడు.. తామెందుకు చేయకూడదంటూ తల్లిదండ్రుల కర్మకాండలు నిర్వహిస్తున్నారు.
తాజాగా.. ఖమ్మం జిల్లాలోనూ తండ్రి చనిపోతే తలకొరివి పెట్టి ప్రశంసలు అందుకున్నారు బండి వెంకటనర్సమ్మ అనే మహిళ. వేంసూరుకు చెందిన బింగి నారాయణ అనే వృద్ధుడు కొడుకులు లేకపోవడంతో పెనుబల్లిలోని కూతురు వద్ద జీవనం సాగిస్తున్నాడు. తండ్రికి అన్నీ తానై సపర్యలు చేసింది. ఈ క్రమంలోనే.. వృద్ధాప్యంతో కూతురు ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు తండ్రి నారాయణ. అయితే.. కొడుకులు లేకపోవడంతో నారాయణ అంత్యక్రియలు కూతుళ్లు, అల్లుళ్లే నిర్వహించారు. అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి.. కూతురే కొడుకుగా మారి.. తండ్రికి తలకొరివి పెట్టింది వెంకటనర్సమ్మ. దాంతో.. కొందరు ఆశ్చర్యపోయినప్పటికీ.. రోజులు మారుతున్నప్పుడు.. సంప్రదాయాలు కూడా మారాల్సిన అవసరముందంటూ ఆమెకు అండగా నిలిచి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు గ్రామస్తులు. తండ్రికి తలకొరివి పెట్టిన కూతుర్ని అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..