Telangana: ఇదెక్కడి దోపిడీ రా మావా.! ఫోన్ ఎత్తిన పాపానికి రూ.4లక్షలు హాంఫట్..ఎలా జరిగిందంటే?

| Edited By: Velpula Bharath Rao

Nov 17, 2024 | 7:31 PM

ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులను సైబర్ నేరాలు తెగ కలవరపెడుతున్నాయి. నగదు దోపిడీకి కొత్త తరహా పంథాను ఎంచుకున్నారు కేటుగాళ్లు.. అధిక లావాదేవీలు చేసే వారిని గుర్తించి టార్గెట్ చేస్తున్నారు. డ్రగ్స్ రవాణా చేస్తున్నారని చెప్తూ బాధితులకు దడ పుట్టిస్తున్నారు. లక్షల రూపాయలను కొట్టేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

Telangana: ఇదెక్కడి దోపిడీ రా మావా.! ఫోన్ ఎత్తిన పాపానికి రూ.4లక్షలు హాంఫట్..ఎలా జరిగిందంటే?
Cyber Criminals Doing New Kind Of Frauds In Mahabubnagar
Follow us on

మహబూబ్‌‌నగర్ జిల్లాలో వరుస సైబర్ మోసాలు కలకలం రేపుతున్నాయి. రోజుకో కొత్త రకం మోసంతో అమాయక ప్రజల బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు..నేరగాళ్లు దోపిడి చేయడానికి  రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. మొన్నటి వరకు APK ఫైల్స్, OTP లతో లూటీ చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు ఏకంగా పోలీసుల అవతరమెత్తుతున్నారు. విచారణల పేరుతో ఖాతాల్లోకి లాగిన్ అయ్యి.. దోపిడీ చేస్తున్నారు. గడచిన కొన్ని రోజులుగా డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సాప్ట్ వేర్ ఉద్యోగులు, ఎక్కువ మొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ చేసే వాటిని టార్గెట్ చేసుకొని.. లక్షల్లో డబ్బులను కాజేస్తున్నారు. ముంబై నుంచి కాల్ చేస్తున్నాం.. నీ పేరు మీద ఉన్న పార్శిల్‌లో కొన్ని వస్తువులతో పాటు.. నిషేధిత డ్రగ్స్ లభించాయి. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని భయపేట్టిస్తారు. ఈ గ్యాప్‌లోనే మా డీసీపీకి కాల్ చేస్తున్నాం మాట్లాడండి అని చెప్తారు.

లోన్ అప్లై చేయించి మరీ.. దోపిడీ:

ఇక ఆ వ్యక్తి లైన్లోకి వచ్చి స్కైప్‌లో కాల్ చేస్తాం.. Id చెప్పి మీటింగ్‌కు అటెండ్ కావాలని బెదిరిస్తారు. ఇక మీరు విదేశాలకు డ్రగ్స్ తరలిస్తూ.. డబ్బులు సంపాదిస్తున్నారు. మీ ఖాతాల్లో ఆ నగదు జమ అవుతున్నట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయని భయపెట్టిస్తారు. ఇక బాధితుడు ఎలాగో ఆ తప్పు చేయలేదు కాబట్టి.. నాకు సంబంధం లేదు అని సదరు అధికారికి చెప్పేవరకు చూసి.. మెళ్లిగా అసలు స్కెచ్ అమలు చేస్తారు. అయితే మీ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ చేయండి.. మళ్ళీ 15నిమిషాల్లో తిరిగి పంపిస్తాం.. ఈ ట్రాన్సాక్షన్‌ను మేము ఒకసారి పరిశీలిస్తామని వారి అకౌంట్ నెంబర్లు ఇస్తారు. ఒకవేళ ఎలాంటి సమస్య లేకపోతే విడిచిపెడుతామని చెప్తారు. ఈ విధంగా ఖాతాల్లో ఉన్న నగదు మొత్తం దోచేస్తున్నారు. ఒకవేళ ఖాతాలో నగదు లేకపోతే అప్పటికప్పుడు పర్సనల్ లోన్ అప్లై చేయించి.. ఆ నగదును కొట్టేస్తున్నారు.

వెలుగులోకి రెండు ఘటనలు:

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇదే తరహాలో లక్షల రూపాయల నగదును పోగొట్టుకున్నారు. SS గుట్టకు చెందిన రమేష్ గౌడ్ సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం fed x నుంచి మీరు పార్శిల్ పంపిస్తున్నారని, అందులో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టి రూ.4,77,000 లను దోచేశారు. డిజిటల్ అరెస్టు చేస్తున్నామని.. ప్రోసిజర్ ఫాలో కావాలని చెప్పి బెంబేలెత్తించారు. దోషిగా మీరు ఉన్నారో లేదో తేల్చేందుకు నగదు ట్రాన్స్ఫర్ చేయాలని మాయ మాటలు చెప్పారు. అప్పటికప్పుడు అకౌంట్లో డబ్బులు లేకపోయినా.. క్రెడిట్ కార్డ్‌ల నుంచి విత్ డ్రా పెట్టించి మరీ నగదును దోపిడీ చేశారు. ఇక వెంకటేశ్వర కాలనీకి చెందిన రాజేష్ సైతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు సైతం ఇదే తరహా స్కెచ్‌తో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఆయన ఖాతాలో నగదు లేకపోతే పర్సనల్ లోన్ అప్లై చేయించి మరీ రూ.10లక్షలు అప్పటికప్పుడు మాయం చేశారు. ఇదే కాకుండా క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం అదనంగా మరో రూ.2లక్షలు కాజేశారు.

గంటల తరబడి డిజిటల్ అరెస్టుతో రాజేష్‌ను భయభ్రాంతులకు గురిచేశారు. డబ్బులు పంపిన తర్వాత తిరిగి రావడం లేదని ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ కొత్త తరహా సైబర్ మోసంపై రాజేష్ రూరల్ పోలీసు స్టేషన్లో, రాము గౌడ్ 2వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు జిల్లా కేంద్రంలో ఇంకా ఉన్నప్పటికీ పరువు పోతుందని బాధితులు బయటకు రావడం లేదు. చేయని తప్పులకు ప్రజలు భయపడవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనవసరంగా ఎవరికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవద్దని అసలు డిజిటల్ అరెస్టులు ఉండవని తేల్చి చెబుతున్నారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు మోసాల రూట్ మార్చే ఈ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫోన్ చేసి కారణాలు ఏమి చెప్పిన..మనీ విషయానికి వస్తే అది సైబర్ వలగానే భావించాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి