Cyber Crime: IAS, IPS ను వదలని సైబర్ నేరగాళ్లు.. ఇద్దరు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్‌కు ఝలక్..!
టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అదే స్థాయిలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇళ్లలో చొరబడి దోపిడీలకు పాల్పడే దొంగల కంటే ఏసీ గదుల్లో కూర్చుని దర్జాగా అకౌంట్లలోని డబ్బు లూఠీ చేసే సైబర్ నేరగాళ్లు పెరిగిపోయారు.
టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అదే స్థాయిలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇళ్లలో చొరబడి దోపిడీలకు పాల్పడే దొంగల కంటే ఏసీ గదుల్లో కూర్చుని దర్జాగా అకౌంట్లలోని డబ్బు లూఠీ చేసే సైబర్ నేరగాళ్లు పెరిగిపోయారు. ఈ కేటుగాళ్లు అమాయక ప్రజలనే కాదు విద్యావంతులు, మేధావులు, ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులను కూడా బురిడీ కొట్టించి దోపిడీలకు పాల్పడుతున్నారు. దొరికితే దొంగ లేదంటే దొర అన్నట్లు సాగుతున్న సెల్‌ఫోన్ చీకటి సామ్రాజ్యంలో విచ్చలవిడి దోపిడీకు బరితెగిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలనే కాదు ఐఏఎస్, ఐపీఎస్ లను కూడా వదలడం లేదు. ఏకంగా పోలీస్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లను సైతం పరేషాన్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ కు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలను రక్షించాల్సిన అధికారులే వారికి టార్గెట్ అయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ అధికారులు ప్రజలను, ద్వితీయశ్రేణి సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఇప్పటివరకు చాలామంది అమాయకుల పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపడం, ఫేక్ వాట్సాప్ నెంబర్లతో చాటింగ్ చేసి అమాయకులను మోసం చేయడం చూశాం. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా ఎస్ఎమ్ఎస్ చేసి ఆన్‌లైన్ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అక్కడక్కడ తరచూ చూస్తున్నాం. ఇలాంటి సైబర్ మోసాల నుండి ప్రజలను కాపాడాల్సిన పోలీసు అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. మరింత బరితెగించిన సైబర్ నేరగాళ్ళు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులకు కూడా ఝలక్ ఇస్తున్నారు.. తాజాగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. అర్జంట్ మీటింగ్ లో ఉన్నాను కొంత డబ్బు కావాలి.. ఫోన్ పే చేయండి ప్లీజ్ అంటూ కొందరు ద్వితీయ శ్రేణి అధికారులకు మెసేజ్ పంపారు.
+94784977145 నెంబర్ కు ఫోన్ పే చేయండి అని మెసేజ్ పంపారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. షాక్‌కు గురైన కలెక్టర్ సత్య శారదా దేవి వెంటనే పోలీసులకు పిర్యాదు చేశారు. సిబ్బందిని, ప్రజలను అప్రమత్తం చేశారు.. తన పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయవద్దని, ఎలాంటి మనీ ట్రాన్సఫర్ చేయవద్దని సూచించారు.
పోలీసుల విచారణలో ఈ నెంబర్ శ్రీలంక రిజిస్ట్రేషన్ తో ఉన్నట్లు గుర్తించారు. ఇది సైబర్ నేరగాళ్ల పనే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అయితే గత వరంగల్ జిల్లా కలెక్టర్, ప్రస్తుతం హనుమకొండ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రావీణ్యకు కూడా సైబర్ నేరగాళ్లు ఇదే విధంగా షాక్ ఇచ్చారు. నకిలీ ఫేస్ బుక్ ఐడీతో కొందరు అధికారులకు మెసెజ్ పంపి డబ్బులు గుంజేందుకు స్కెచ్ వేశారు. గత కలెక్టర్ ఐడీతో +94776414080 నెంబర్ కు ఫోన్ పే చేయాలని మెసేజ్ పంపారు. కలెక్టర్ ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఈ నెంబర్ కూడా శ్రీలంక కు చెందినదిగా గుర్తించారు.
ఈ కలెక్టర్లను మాత్రమే కాదు.. వరంగల్ పోలీస్ కమిషనర్ ను కూడా సైబర్ నేరగాళ్లు వదలలేదు. వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి కొందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. అర్జెంట్ అవసరం ఉందని మెసేజ్ చేసి డబ్బులు లాగే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీస్ కమిషనర్ ప్రజలను, తన కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు..
సైబర్ నేరగాళ్ళ నుండి ప్రజలను రక్షించాల్సిన అధికారులే ఇప్పుడు వారికి టార్గెట్ గా మారడం జనంలో చర్చగా మారింది. ఇంకా ఎన్ని కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తాయో..? సైబర్ నేరగాళ్లు ప్రజలను ఏ విధంగా సర్వం దోచేస్తారో అనే ఆందోళన వ్యక్తమవుతుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..