
వరంగల్ జిల్లాలో కేవలం నెల రోజుల్లో 20కి పైగా పెట్రోల్ బంకులలో చోరీలు జరిగాయి. క్లాస్‌గా ఖరీదైన కారులో వచ్చి వెనుక క్యాన్లు పెట్టుకుని అందులో పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ చేయించుకున్నారు. కార్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నామని నమ్మించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ప్రతి బంకులో పదివేల రూపాయలకు పైగానే ఇంధనం ఫిల్లింగ్ చేయించుకున్నారు. బంక్ సిబ్బంది.. వాళ్ల వెంట పరుగులు పెట్టి కారును పట్టుకునే ప్రయత్నం చేసినా.. ఎక్కడా చిక్కకుండా ఎస్కేప్ పోయారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని దాదాపు 20కి పైగా బంకులలో ఈ ముఠా పెట్రోల్, డీజిల్ దోపిడీలకు పాల్పడ్డారు.
పరకాల, నడికూడ, దామెర, రేగొండ, రాయపర్తి, జఫర్గడ్ మండలాల్లో ప్రధాన రహదారి పక్కన ఉన్న బంకులలో ఈ తరహా దోపిడీలో పాల్పడ్డారు. నెంబర్ ప్లేట్ లేని కారు వస్తుందంటేనే బంక్ సిబ్బంది వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. రాత్రి సమయంలో బంకులోకి వచ్చి వెనక సీటులో రెండు క్యాన్లలో పెట్రోల్, డీజిల్ నింపుకునేవారు. అదే సమయంలో నెంబర్ ప్లేట్ లేని వారి కారులో కూడా ఇంధనం ఫుల్ టాంక్ చేయించుకుని ఫోన్ పే చేస్తున్నట్టుగా నటించి అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ముఠా దోపిడీలన్నీ సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. అవి చూసి ఆందోళన చెందడం తప్ప బంకు యజమానులు ఏమీ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే ఈ ముఠాను పట్టుకోవడం కోసం అత్యంత చాకచక్యంగా వివరించిన పరకాల పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన రంజిత్, ఆత్మకూర్‌కు చెందిన నవీన్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన భరత్ చంద్ర అనే ముగ్గురు ఉన్నారు. వీరంతా ఉన్నత కుటుంబాలకు చెందినవారే. జల్సాలకు అలవాటుపడి కష్టపడకుండా డబ్బు సంపాదించడం కోసం ఇలాంటి కక్కుర్తి వేషాలు వేసి కటకటాల పాలయ్యారు. వారిని అరెస్టు చేసిన పరకాల పోలీసులు కారు సీజ్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కంత్రీగాళ్ళు అరెస్ట్ కావడంతో పెట్రోల్ బంక్ యాజమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కూడా రిలాక్స్ అయ్యారు.