Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు.. టిడిపి రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు.. కాంగ్రెస్ పార్టీని వీడని అంతర్గత కుమ్ములాటలు
కేవలం వారం రోజుల వ్యవధిలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవించాయి. అందులో ఒకటి టిడిపి రీఎంట్రీ సభ కాగా, మరొకటి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రచ్చ రంబోలా..

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది తెలంగాణలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. 2014 ఎన్నికల తర్వాత ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ కంచికి అనుకున్న వాళ్లంతా ఇప్పుడు గతుక్కుమనే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీని పునరుజ్జీవింప చేసుకోవడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు సంకల్పించారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా వెంటనే ప్రారంభించారు. అందులో భాగంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ” తమ్ముల్లూ.. తిరిగి వచ్చేయండి..!! ” అంటూ గతంలో టిడిపిని వీడిన వారంతా తిరిగి పార్టీలో చేరాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ రాజకీయాలకే చంద్రబాబు పరిమితం అనుకున్న టిడిపి నేతలు పెద్ద సంఖ్యలో తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ (ప్రస్తుతం బి.ఆర్.ఎస్) పార్టీలో చేరిపోయారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ కార్యకర్తల బలం ఉంది. అదే సందర్భంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినా కూడా పెద్దగా గుర్తింపు లేదని భావిస్తున్న పలువురు మాజీ టిడిపి నేతలు మరోసారి చంద్రబాబు పార్టీ వైపు చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణాన్నే ఆసరాగా చేసుకుని తెలంగాణలో మళ్లీ బలం పెంచుకోవడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొన్ని రోజుల క్రితం పాలేరులో తన సామాజిక వర్గం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలావిష్కరణ చేస్తూ.. తాను పాలేరులోనే పోటీ చేస్తానని, అయితే ఏదైనా పార్టీ తరపునా లేక ఇండిపెండెంట్‌గానా అనేది ఇప్పుడే చెప్పలేనని తుమ్మల వ్యాఖ్యానించారు. అప్పటి నుంచే తెలంగాణలో టిడిపి పార్టీ మరోసారి పునర్వైభవం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తుంది అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఊహగానాలను నిజం చేస్తూ తాజాగా చంద్రబాబు ఖమ్మంలో భారీ సభ నిర్వహించారు. తెలంగాణలో టిడిపికి పూర్వవైభవం తెద్దామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డమీదనేనని.. హైదరాబాద్ నడిబొడ్డునే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపించారని చంద్రబాబు గుర్తు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్న విధానంతోనే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మరోసారి పూర్వ వైభవం దిశగా నడిపిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణలో టిడిపి లేదన్న వారికి గుణపాఠం చెప్పేలా ఖమ్మం సభ నిర్వహించారని పార్టీ శ్రేణులను చంద్రబాబు అభినందించారు. ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభకు భారీగా జనం హాజరవడం మిగిలిన రాజకీయ పక్షాలను కలవరపాటుకు గురిచేసింది అని చెప్పొచ్చు. హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాలు తన హయాంలోని అభివృద్ధి చెందాయని చంద్రబాబు గత నుంచి చెబుతూ వస్తున్నారు. తాజాగా అవే మాటలను పునరావృతం చేశారు. హైదరాబాద్ సైబర్ టవర్స్ దగ్గర నుంచి భద్రాచలం కరకట్టదాకా తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను బహిరంగ సభలో వల్లేవేయడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఇంకా అవకాశం ఉంది అని చాటే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఖమ్మం సభ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆ పార్టీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ” తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా..! ” అంటూ విజయ శంఖారావం పూరించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపుతో పలువురు మాజీ టిడిపి నాయకులు తిరిగి ఆ పార్టీ వైపు చూస్తున్నట్టుగా తాజాగా తెలుస్తోంది. అయితే అధికారమే పరమావధిగా కొనసాగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో .. తెలంగాణలో టిడిపి పార్టీ అధికారానికి వచ్చే అవకాశాలు అంతగా లేవు కాబట్టి ఆ పార్టీలో ఎవరు చేరుతారు? ఎవరు చేరరు? అన్నది ఆసక్తి రేపుతోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నాయకుల్లో ఎన్నటికీ మార్పు రాదని తాజా పరిణామాలు చాటి చెబుతున్నాయి. డిసెంబర్ 10వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ కమిటీలను పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో మొదలైన రగడ రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది. పరిస్థితిని చక్కదిట్టడానికి అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి తన వెంట వచ్చిన టిడిపి నాయకులకు పెద్దపీట వేస్తూ కమిటీలను ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్న జి-9 తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పార్టీ అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై సీనియర్లు తిరుగుబాటు బావుట ఎగురవేసిన నేపథ్యంలో పలువురు రేవంత్ రెడ్డి అనుచరవర్గం నేతలు తమకు పార్టీలో సంక్రమించిన పదవులను త్యజించారు. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అనుకూల, రేవంత్ రెడ్డి వ్యతిరేకవర్గాలుగా రెండు చీరకలు స్పష్టంగా కనిపించాయి. పలువురు సీనియర్లు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తదితర నేతలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తారు. కొంతకాలంగా మౌనంగా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానానికి తన వాదనను వినిపించి వచ్చారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి అనుకూల వర్గంగా భావిస్తున్న పలువురు నేతలు మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే అనిల్ తదితరులు సీనియర్లపై ధ్వజమెత్తారు. పరిస్థితి విషమిస్తున్న సంకేతాలను గమనించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ రంగంలోకి దింపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి కాలంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్ కు తెలుగు రాజకీయాలపైనా, ఇక్కడి నేతలపైనా మంచి అవగాహన ఉన్న నేపథ్యంలో ఆయన నియామకంతో పరిస్థితి అదుపులోకి వస్తుందని పలువురు భావించారు. అనుకున్నట్లుగానే దిగ్విజయ సింగ్ హైదరాబాద్ చేరుకొని పార్టీ సీనియర్లతోనూ, ఇతర కీలక నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు, ఇలాంటి తరుణంలోనే గాంధీభవన్ మరోసారి రచ్చ రచ్చ అయింది. రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ శ్రేణులు దిగ్విజయసింగ్ ఓవైపు సంప్రదింపులు కొనసాగిస్తున్న తరుణంలోని గాంధీభవన్లో బాహాబాహీకి దిగారు. అసలే పార్టీ పరిస్థితి బాగాలేదు అలాంటి తరుణంలో ఐకమత్యంతో వ్యవహరించి పార్టీని విజయపు బాట వైపు మళ్లించాల్సిన నాయకులు పరస్పరం గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న సందర్భం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేసింది. ” అరే కాంగ్రెస్ నేతలు ఇక మారరా ? ” అన్న కామెంట్లు చాలా మంది నోట వెలువడ్డాయి. మరో 10 నెలల కాలంలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు తమ తమ వ్యూహాలతో చురుకుగా వ్యవహరిస్తున్నాయి. రెండు పార్టీలు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో మాటల తూటాలు పేలుస్తున్నాయి, గ్రౌండ్ లెవెల్ లో పట్టు పెంచుకునేందుకు బిజెపి పాదయాత్రలను నమ్ముకోగా.. గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బంగారు తెలంగాణను సాధించామని చెప్పుకుంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలు జిల్లాల్లో పలు కార్యక్రమాలను చేపట్టారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటాపోటీ కొనసాగుతున్న నేపద్యంలో మూడో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత విభేదాలతో, గ్రూపు తగాదాలతో, వర్గ విభేదాలతో తల్లడిల్లుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ తన ప్రయత్నంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిన పరిస్థితి.
కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న చిచ్చును చల్లబరిచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయసింగ్ వచ్చి రావడంతోనే తన పనులు ప్రారంభించారు. డిసెంబర్ 21న రాత్రి హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్ వెంటనే మంతనాలు ప్రారంభించారు. నిజానికి హైదరాబాద్ రావడానికి ముందే ఢిల్లీలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీపిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో ఢిల్లీలో భేటీ అయ్యారు. వీరితో విడివిడిగా సంభాషించిన దిగ్విజయ సింగ్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలతో భేటీల కోసం ప్రణాళిక రూపొందించుకున్నారు. డిసెంబర్ 22, 23 తేదీలలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన ముఖాముఖి భేటీ అయి పరిస్థితిని తెలుసుకోవడం ద్వారా అంతర్గత విభేదాలను నివారించేందుకు ప్రయత్నించనున్నారు డిగ్రీ రాజా. తెలంగాణ కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నేతలు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో ఎవరు అసంతృప్తిలోను కాకుండా అందరికీ అవకాశం లభించేలా టీపీసీసీకి ఒక జంబో కార్యవర్గాన్ని అధిష్టానం నియమించింది. దాంతోపాటు రాజకీయ వ్యవహారాల కమిటీ పేరిట ఒక కీలకమైన నియామకాన్ని చేసింది. అదే సందర్భంలో కొత్తగా ఏర్పాటు అయిన జిల్లాలకు డిసిసి అధ్యక్షులు నియామకమూ జరిగింది. ఇలా చాలామందికి అవకాశం దక్కినప్పటికీ సీనియర్లకు సరైన అవకాశాలు లభించలేదని, టిడిపి నుంచి వలస వచ్చిన వారికే పెద్ద పీట వేశారని పలువురు సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు, వీరిలో ఒకరిద్దరూ అంటే కొండా సురేఖ లాంటి వారు రేవంత్ రెడ్డి బుజ్జగించడంతో వెనక్కి తగ్గినప్పటికీ, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహ లాంటి వారు మాత్రం మీడియాకెక్కిమరి రేవంత్ రెడ్డి వైఖరి మీద అసంతృప్తి వెళ్ళగక్కారు. ఎప్పుడైతే దామోదరం రాజనర్సింహ మీడియా ముఖంగా బయటపడ్డారో ఆయన వెంట పలువురు సీనియర్ నాయకులు కూడా నడిచారు. ఈ క్రమంలోనే 9 మంది కీలకమైన నాయకులు హైదరాబాదులో భేటీ అయి టిపిసిసి అధ్యక్షుడి వ్యవహార శైలిపైనా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పైనా అసంతృప్తి వెళ్ళగక్కారు. సీనియర్ల కామెంట్లను తొలత సీరియస్‌గా తీసుకోనప్పటికీ.. ఆ తర్వాత వారి వ్యవహార శైలి మరింత తీవ్రం అవుతున్న సంకేతాలను గమనించిన పార్టీ అధిష్టానం కీలకమైన సందర్భంలో ఇలాంటి అంతర్గత కొమ్ములాటలు సమంజసం కాదని, అందరినీ బుజ్జగించడం ద్వారా పరిస్థితిని అదుపు చేయాలన్న ఉద్దేశంతో డిగ్గిరాజాను హైదరాబాద్ పంపించింది. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చిన్నచిన్న విభేదాల కారణంగాను, సమాచార లోపం కారణంగాను ఉత్పన్నం అయ్యాయని దిగ్విజయ సింగ్ భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ వచ్చే ముందు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన డిగ్రీ రాజా ఇదే అభిప్రాయాన్ని ఆయన ముందు వ్యక్తం చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు ఆయన జరపనున్న సమాలోచనలు ఏ మేరకు సత్ఫలితానిస్తాయన్నది ఆసక్తి రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..