Covid Free Villages: కరోనాతో ప్రపంచమంతా అతాలకుతలం అవుతుంటే ఆ జిల్లాలోని ఆదివాసీ పల్లెల్లో మాత్రం కరోనా కాలు పెట్టడానికి గజగజలాడుతోంది. సొంత జిల్లాలోనూ వేల కేసులు నమోదవుతున్నా ఇక్కడి మూడు గ్రామాలు మాత్రం ఎప్పటిలానే ప్రశాంతంగా గడుపుతున్నాయి. నిర్మల్ జిల్లా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని సారంగాపూర్ మండల పరిధిలోని పెంటదరి, ఇప్పచల్మ, లక్ష్మీ నగర్ గ్రామాలు.
ఈ మూడు ఆదివాసి గ్రామాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అందుకు ఆ గ్రామాల ఆదివాసీ ప్రజలుపెట్టుకున్న కట్టుబాట్లే అందుకు నిదర్శనం. వారు అమలు చేసుకుంటున్న కఠిన నియమ నిబంధనలే వారి ప్రాణాలకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి. అసలే మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు అందులోనూ, చుట్టు కరోనా ప్రభావంతో అల్లాడుతున్న గ్రామాలు, అయినా కరోనా మహామ్మారి తమ గ్రామంలోకి మాత్రం ఎంట్రీ ఇవ్వకుండా గట్టి చర్యలే తీసుకుంటున్నారు ఇక్కడి గ్రామస్తులు.
ఇక్కడి ప్రజలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంబలి ఆహారంగా తీసుకుంటారట. వీటితోపాటు గట్కా తింటారట. తమ పొలాల్లోనే పండిన పప్పు దినుసులను ఆహారంగా తీసుకుంటారు. నిత్యం వ్యవసాయ పనులు చేస్తూ..పౌష్టికాహారం తీసుకోవడంతో వీరంతా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇక ఊరు దాటకుండా కఠిన ఆంక్షలు పెట్టుకున్నారు. ఒకవేళ ఊరు దాటితే పసుపు నీళ్లతో స్నానం చేసి ఇంట్లోకి రావడం.. వేడి నీళ్లు తాగడం.. ఔషద మూలికల ద్రావణం ప్రతి మూడు గంటలకు ఓ సారి తాగడం అలవాటు చేసుకున్నారు. ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలకే ఆహారం లో ఎక్కువ చోటు ఇస్తారు. ఇవే ఇక్కడి ప్రజలను కరోనా నుండి దూరంగా ఉంచడానికి సాయపడుతున్నాయని పెంటదరి ఆదివాసీ గ్రామ పటేల్ చెబుతున్నారు.
మరో ఆదివాసీ గ్రామం ఇప్పచెల్మ గ్రామంలో అయితే 85 ఏళ్ల ఔషద మూలిక వైద్యుడు దొందన్న ఇచ్చే మూలికల ద్రావణమే ఇక్కడ అమృతం. 21 ఔషద చెట్ల నుండి సేకరించిన మూలికలతో తయారు చేసిన కషాయాన్ని ప్రతి ఇంటికి పంపిణి చేస్తుండటం.. ఆ ఔషదం సేవిస్తున్న ఆదివాసీలకు జ్వరం, జలుబు కూడా దరిచేరదట. అయితే కరోనాను అంత ఈజీగా కొట్టి పారేయడం లేదని.. కరోనా కట్టడికి మూతికి రుమాలు ఉండాల్సిందేనాని చెపుతున్నారు ఇక్కడి ప్రజలు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో గ్రామంలోకి కొత్త వ్యక్తులను రానీయడం లేదు. అప్పటి నుంచి మహారాష్ట్ర వాసులు గ్రామంలోకి రాకుండా యువకులంతా బృందాలుగా ఏర్పడి గస్తీ కాస్తున్నారు.
పచ్చని ప్రకృతిలో పట్టణాలకు దూరంగా ఉండి బతికిపోయామని.. కాస్త తాగు నీటి ఎద్దడి ఉన్నా కరోనా మహామ్మారితో పోలిస్తే ఇది ఓ సమస్యే కాదంటున్నారు ఇక్కడి జనం. చావుకు వెళ్లాల్సి వస్తే భౌతిక దూరం పాటిస్తున్నామని.. శుభకార్యాలను గ్రామాల్లో నిషేదించామని.. రాత్రి 6 దాటితే గడప దాటకూడదనే కఠిన నియమ నిబందనలు అమలు చేసుకుంటున్నామని చెబుతున్నారు. కరోనా వేళ ఇలాంటి పల్లెలు పాటిస్తున్న కట్టుబాట్లు పట్టణాలు కూడా తప్పక పాటిస్తే కరోనా అంతం పక్కా.
Also Read:
Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..
మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?
Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!