నల్లగొండ, ఆగస్టు 3: ప్రేమించుకున్నారు.. ఇద్దరు ఒక్కటయ్యారు. జల్సాలకు అలవాటు పడ్డారు. క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన గేమ్స్ వంటి వ్యసనాలకు బానిసలై.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు.. ఈ క్రమంలోనే స్నేహితుడిపైనే తన భార్యతో వలపు వల విసిరాడు. 30 లక్షల రూపాయలు లాగేశారు.. చివరికి కటకటాల పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెంకు చెందిన సట్టు నారాయణ, దొంగల సతీష్ ఇద్దరూ స్నేహితులు.. అయితే నారాయణ.. నేరేడుచర్లకు చెందిన భారతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరు మిర్యాలగూడలో కాపురం పెట్టారు. జల్సాలకు అలవాటు పడిన ఈ దంపతులు.. క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన గేమ్స్ వంటి వ్యసనాలకు బానిసలయ్యారు. దీంతో ఆర్థిక సమస్యలు ఎక్కువై అప్పుల పాలయ్యారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ఈజీ మనీ కోసం ప్లాన్ వేశారు. ఇందుకు తన స్నేహితుడు సతీష్ పై భార్యతో వలపు వల విసిరాడు నారాయణ.. దీనికోసం.. పక్కా ప్రణాళికతో స్కెచ్ వేసి డబ్బులు లాగేశారు.
సతీష్‌కు ఫోన్‌లో నారాయణ.. తన భార్య భారతిని.. సంధ్య పేరుతో తన స్నేహితురాలిగా పరిచయం చేశాడు. అప్పటినుంచి భారతి.. సతీష్ పై వలపు వల విసిరింది. ఇలా నాలుగేళ్లుగా ఫోన్లో ప్రతిరోజు ప్రేమతో పలకరించేది. సంధ్య పేరుతో భారతి అడిగినప్పుడల్లా.. సతీష్ డబ్బులు పంపిస్తుండేవాడు. తనకున్న వ్యవసాయ భూమిని అమ్మి కూడా 30 లక్షల రూపాయలను ఇచ్చాడు. ఇంకా డబ్బులు కావాలంటూ వేధిస్తుండడంతో చేసేదేమీ లేక సతీష్ పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పాలకవీడు పోలీసులు కాల్ డేటా ఆధారంగా భార్యాభర్తలు నారాయణ, భారతీలను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వలపు వల బండారం బయటపడింది. అనంతరం వారిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వీరి నుంచి టీవీ, ఫ్రిడ్జ్, రూ.13 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి సైబర్ నేరాల వలపు వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు యువతకు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..