Telangana: లిక్కర్ స్కాంలో కవిత విచారణపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కోమటిరెడ్డి అంశంపై ఏమన్నారంటే

లిక్కర్ స్కాంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేస్తారా.. ఊరికే ప్రశ్నించి వదిలేస్తారా అంటూ..

Telangana: లిక్కర్ స్కాంలో కవిత విచారణపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కోమటిరెడ్డి అంశంపై ఏమన్నారంటే
Jaggareddy
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 10, 2022 | 7:35 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలపై 160 సీఆర్పీసీ నోటీసు ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఆదివారం సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈనెల 6వ తేదీనే సీబీఐ అధికారులు ఈ కేసులో కవిత వివరణ తీసుకోవల్సి ఉండగా.. ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల కారణంగా తాను ఆరోజు అందుబాటులో ఉండలేనంటూ నాలుగు ప్రత్యామ్నాయ తేదీలను సూచించారు. దీని ప్రకారం 11వ తేదీ ఆదివారం కవిత వివరణ సీబీఐ అధికారులు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేస్తారా.. ఊరికే ప్రశ్నించి వదిలేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. కవితను అరెస్ట్ చేస్తేనే బీజేపీది నాటకం కాదని స్పష్టమవుతుందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు అంశాలపై పార్టీలో చర్చించి తమ వైఖరి వెల్లడిస్తామన్నారు. అలాగే టీపీసీసీ కొత్త కార్యవర్గం కూర్పుపై జగ్గారెడ్డి స్పందించారు. కార్యవర్గం కూర్పుపై చాలా రోజులుగా కసరత్తు జరుగుతోందన్నారు. 84 మందికి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. కమిటీలో ఎవరికైనా అవకాశం లభించకపోతే.. తర్వాత వారిని కలుపుకునే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం పోటీ ఎప్పుడూ ఉంటుందన్నారు.

ఈ కమిటీకి సంబంధించిన నిర్ణయం ఏఐసీసీదేనని చెప్పారు. అధిష్టానం నిర్ణయాన్ని అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు. అందరితో సంప్రదింపుల తర్వాతే కొత్త కార్యావర్గాన్ని ప్రకటించినట్లు తెలుస్తోందన్నారు. సామాజికంగానూ అందరికి అవకాశాలు కల్పించారని, తమ పార్టీలో నాయకులకు కొదవలేదని, టీఆర్ఎస్, బీజేపీలకే నాయకుల కొరత ఉందని, అందుకే కాంగ్రెస్ నాయకులను చేర్చుకుంటున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సరైన సమయంలోనే ఏఐసీసీ ఈ కమిటీని ప్రకటించిందని, ఎన్నికలకు ఉన్న ఏడాది సమయం సరిపోతుందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంశం తమ పరిధిలోనిది కాదని, ఏఐసీసీ స్థాయిలోనే వెంకటరెడ్డి గురించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

బీజేపీతో పోటీ బీఆర్ఎస్ అని వాళ్లు అనుకుంటే సరిపోదని, మాటలకేం.. ఎన్నైనా చెప్పవచ్చని జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సోనియా గాంధీ ఇవ్వడం వల్ల తెలంగాణ వచ్చిందని, అందుకే తెలంగాణ తెచ్చినా అని కేసీఆర్ అంటున్నారని అన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. దేశ ప్రజలకు తెలియదు కాబట్టి కొత్త నాటకం మొదలుపెట్టారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఉపఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకోవడానికి లేదన్నారు. ఉపఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలత ఉంటుందని, సాధారణ ఎన్నికల్లో డబ్బు అంతగా ప్రభావం చూపించబోదన్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్నవి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..