Inter Student Suicide: తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం నార్లకుంట తండాలో ఒకరు.. ఖమ్మం జిల్లాలో ఇద్దరు, హైదరాబాద్ పరిధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా జగిత్యాల (jagtial district) జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫెయిల్ అవడంతో నిరోషా అనే విద్యార్థిని మనస్థాపంతో బుధవారం ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన యాగండ్ల నిరోషా(17) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌లో రెండు సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు.
విద్యార్థులకు తల్లిదండ్రులు ధైర్యాన్నివ్వాలి.. మంత్రి సబితా..
ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఎడాది నష్ట పోకుండా ఉండేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి గుర్తుచేశారు. ఈ సమయంలో విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని వారి తల్లిదండ్రులను కోరారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని కళాశాల లెక్చరర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులారా… ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బండి సంజయ్..
కాగా.. విద్యార్థుల ఆత్మహత్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిలయ్యామనే బాధతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మనసును తీవ్రంగా కలిచి వేస్తోందని.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న బాధను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందంటూ బండి సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులారా… క్షణికావేశంతో నూరేళ్ల జీవితాన్ని పాడుచేసుకోకండి. మీ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చకండి అంటూ పేర్కొన్నారు. పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదని.. బంగారు భవిష్యత్తు ముందుందని.. సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశాలున్నాయని సూచించారు.
గుండె తరుక్కుపోతుంది.. రేవంత్ రెడ్డి
కాగా.. విద్యార్థుల ఆత్మహత్యలపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పందించారు. ఫలితాల తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులు పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు జీవితం విలువను అర్థం చేసుకోవాలని, ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును మినహాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ట్విట్‌ను ట్యాగ్ చేశారు.
It’s heart wrenching to see intermediate students resort to extreme measures after results.
I appeal to them to understand the value of life & not take any drastic steps.
I demand @TelanganaCMO to waiver the fee for revaluation & supplementary examination.@SabithaindraTRS
— Revanth Reddy (@revanth_anumula) June 29, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..