Telangana Elections: ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్క రూపాయికే పనిచేస్తా.. ఆ నియోజకవర్గ అభ్యర్థి ఆసక్తికర ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతలు హామీల వర్షాన్ని గుప్పిస్తున్నారు. ఒకరికి మించి మరోకరు సంచలన హామీలను గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ కన్పిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతలు హామీల వర్షాన్ని గుప్పిస్తున్నారు. ఒకరికి మించి మరోకరు సంచలన హామీలను గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ కన్పిస్తోంది. ప్రత్యేక హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. చేపట్టే కార్యక్రమాల గురించి వివరిస్తూ ఓటరు దేవుళ్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థి రూపాయి వేతనానికే ప్రజలకు సేవ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌మోహన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే గాంధారి మండలంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ మోహన్ మాట్లాడుతూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. రూ.30 కోట్లకు ఎల్లారెడ్డి ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు దక్కాల్సిన కాంట్రాక్టులను 40 శాతం కమీషన్‌కు ఆంధ్రా కాంట్రాక్టర్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా గెలిస్తే కేవలం ఒక్క రూపాయి వేతనానికే ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. ఎల్లారెడ్డిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఎమ్మెల్యే కాకముందే ఒక్క రూపాయి వేతనంతో పనిచేస్తానంటూ ఆయన ప్రకటన చేయడం జిల్లా రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఓవైపు ఎమ్మెల్యేలు ఏటా రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటుంటే.. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్ ఒక్క రూపాయికే ప్రజలకు సేవ చేస్తానని చెబుతుండడాన్ని ఓటర్ల మధ్య కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుత మనీ పాలిట్రిక్స్‌లో రూపాయికే సేవ చేయడం సాధ్యమయ్యే పనేనా అని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది మాత్రం చిత్తశుద్ధి ఉంటే.. తప్పక చేయోచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సైతం ఒక్క రూపాయి జీతానికే ప్రజలకు సేవలు అందించారు. ఆ తర్వాత మరికొంతమంది నేతలు ఆ ప్రయత్నం చేశారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో మదన్‌మోహన్ చేసిన వ్యాఖ్యలు కొంతమేర ఆసక్తికర చర్చకు తెరలేపాయనే చెప్పాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.