
మూడు రోజులుగా నాన్ స్టాప్ అన్న తరహాలో ప్రచార యుద్ధం సాగుతోంది. ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ.. ఇప్పుడు తగ్గితే ఎప్పటికీ నెగ్గమన్న తరహాలో ప్రత్యర్ధులకు గూబగుయ్యిమనే ఆరోపమలతో విరుచుకుపడుతున్నాయి. సెంటిమెంట్‌ను రగిలిస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. ఈ నేపథ్యంలో సాగిన రాహుల్ గాంధీ బస్సు యాత్ర.. తెలంగాణ కాంగ్రెస్‌కు మంచి బూస్టప్ ఇచ్చిందంటున్నారు పార్టీ నేతలు. గులాబీ కంచుకోటను బద్దలు కొట్టే శక్తి హస్తానికి అందంటూ సాగిన రాహుల్ యాత్ర.. ఎన్నికల ఎజెండాను సెట్ చేయడంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్న హస్తం నేతల మాటలు అక్కడ ఓటర్లను ఆకట్టుకునేలా బస్సు యాత్ర సాగింది.
రాహుల్ బస్సు యాత్ర తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెంచిందని ఆ పార్టీ కేడర్ సంబరాల్లో మునిగారట. ఇటు కాంగ్రెస్ నేతలు సైతం తమ లక్ష్యం నెరవేరిందని ఫుల్ ఖుషీలో ఉన్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు కొనసాగిన రాహుల్ టూర్ తెలంగాణ కాంగ్రెస్ ఇమేజ్ ను మరింత పెంచిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం ఉండదని, ఆ పార్టీ కీలక నేతల్లో భేదాభిప్రాయాలు ఉంటాయని ప్రధానమైన విమర్శ ఉంది. ఎన్నికల ముందు ఈ నెగెటివ్ టాక్ తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేపట్టింది. బస్సుయాత్రలో కీలక నేతలంతా ఒకటిగా కనిపించి విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
రాహుల్ గాంధి మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండటం.. ఆయన నేతృత్వంలో సీనియర్లంతా ఒక్కటిగా మెలగడం.. కాంగ్రెస్ హమీల అమలు బాధ్యత నాది అంటూ రాహుల్ భరోసా కల్పించడం వంటి అంశాలు ప్రజలపై బలమైన ముద్ర వేశాయి. అందుకే మూడు రోజుల యాత్రల్లో ఫుల్ జోష్ కనిపించింది. మూడు ఉమ్మడి జిల్లాల్లో కొనసాగిన బస్సు యాత్ర పది నియోజవర్గాలను టచ్ చేసింది. ఈ బస్సు యాత్ర హస్తం పార్టీకి ఊహించనంత బూస్టప్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాంగ్రెస్ బస్సు యాత్ర ఉత్తర తెలంగాణలో గులాబీ కంచుకోటలుగా నిలుస్తున్న నియోజకవర్గాల గుండా సాగింది. తెలంగాణ వర్సెస్ ప్రజల తెలంగాణ అని ఎన్నికల ఎజెండాను బస్సు యాత్రలో రాహుల్ గాంధీ లాంచ్ చేశారు. పాలనకు దూరమయ్యామనే భావనలో ఉన్న ప్రజలకు రాహుల్ ఎజెండా కొత్త ఉత్సాహన్ని నింపింది. రాబోయే ప్రభుత్వం మనదే అని పదే పదే రాహుల్ చెప్పడం కాంగ్రెస్‌కు సానుకూలంగా మారింది. బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలు, బీఆర్ఎస్ పరోక్ష మద్దతు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెల్లడంలో బస్సు యాత్ర సక్సెస్ అయ్యిందనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది.
మొదటిరోజు బస్సు యాత్ర ఉమ్మడి వరంగల్‌లో సాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే అందులో ములుగు మినహా మిగతావన్నీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే. ఆ జిల్లాలోని నిరుద్యోగుల, మహిళల సమస్యతో పాటు, అధికార పార్టీ ఇసుక అక్రమ రవాణా తదితర అంశాలను కాంగ్రెస్ నేతలు ఫోకస్ చేశారు. ఇక ఉమ్మడి కరీంనగర్లో కొనసాగిన బస్సు యాత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్లో 13 అసెంబ్లీ స్థానాలు ఉంటే, మంథని మినహా మిగతా నియోజకవర్గాలు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే. ఉమ్మడి జిల్లాల వారీగా రాహుల్ చేసిన ప్రసంగాలు, అక్కడి ప్రజలతో రాహుల్ కలిసిపోయిన విధానం జిల్లాలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచిందని ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు.
ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగిన బస్సు యాత్రలో చక్కెర కర్మాగారం తిరిగి ప్రారంభిస్తామని, పసుపు రైతులకు అండగా ఉంటామని రాహుల్ చెప్పడంతో అక్కడి ప్రజలు కాంగ్రెస్ కి జై కొట్టే అవకాశం ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌లో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా వాటిలో అన్ని సిట్టింగ్ స్థానాలు గులాబీ పార్టీవే. ఇక ఈ బస్సుయాత్రతో పార్టీ వీక్ గా ఉన్న పది నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ రీచార్జ్ అయిందని ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు.
బస్సు యాత్రలో కాంగ్రెస్ అనుకున్న ప్రతి అంశాన్ని టచ్ చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ టచ్ చేసేలా సమ్మక్క, సారక్క ప్రాంతం నుండి బస్సు యాత్ర మొదలు పెట్టడం, రామప్ప ఆలయంలో పూజలు చేయడంతో పాటు సింగరేణి కార్మికులు, రైతులు, యువతలో చర్చించడం, సామాన్యులను పలకరించడం, పిల్లలకు చాక్లెట్స్ ఇవ్వడం, రోడ్డుపై హోటల్‌లో దోశలు వేసి తినడం, చిన్న హోటల్ లో టీ తాగడం ద్వారా రాహుల్ బలమైన సందేశాన్ని ప్రజలకు పంపారు. సామాన్య ప్రజలకు కాంగ్రెస్ దగ్గరగా ఉంటుందని రాహుల్ గాంధి చెప్పకనే చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలున్న నేపథ్యంలో.. పాదయాత్ర, రోడ్ షో, ర్యాలీలతో రాహుల్ జనాలతో మమేకం కావడంతో కాంగ్రెస్ అంటే మన అనే ఫీలింగ్ ఓటర్లలో కలుగుతుందనే అంచనాలున్నాయి. ఇవి ఖచ్చితంగా కాంగ్రెస్ కు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయనే భావన నెలకొంది.
ఇక తన మూడు రోజుల యాత్రలో రాహుల్ పొలిటికల్ అంశాలను కూడా చాలా స్పష్టంగా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీ ఒక్కటేనని చెప్పడం, కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడం, తాము అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని రాహుల్ పదేపదే గుర్తు చేయడం ఓటర్లను ఆలోచించేలా చేశాయని కొందరు అంచనా వేస్తున్నారు. మరోవైపు చేరికలు, కోదండరాంతో చర్చలు వెరసి ఈ బస్సు యాత్ర ఆద్యంతం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేలా సాగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ బస్సు యాత్ర ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..