AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో రెండు కాదు మూడు రాజ్యసభ స్థానాలు మావే.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..!

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. తెలంగాణ‌కు సంబంధించి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మూడు రాజ్యసభ స్థానాల్లో అసెంబ్లీలో ప్రస్తుత బ‌లాబ‌లాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ రెండు, బీఆర్ఎస్ ఒక‌టి దక్కించుకునే అవకాశముంది.

Telangana: తెలంగాణలో రెండు కాదు మూడు రాజ్యసభ స్థానాలు మావే.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..!
Telangana Congress
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jan 31, 2024 | 5:36 PM

Share

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. తెలంగాణ‌కు సంబంధించి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మూడు రాజ్యసభ స్థానాల్లో అసెంబ్లీలో ప్రస్తుత బ‌లాబ‌లాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ రెండు, బీఆర్ఎస్ ఒక‌టి దక్కించుకునే అవకాశముంది. కానీ కాంగ్రెస్ మూడు సీట్లూ కైవ‌సం చేసుకునేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఇంత‌కీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ ప్లాన్ వ‌ర్క్ అవుట్ అవుతుందా? తమ ఎమ్మెల్యేల బలం రెండు రాజ్యసభ సీట్లకు ఉన్నా.. మూడు రాజ్యసభ స్థానాలు మావే అని హస్తం నేతలు చెబుతుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ‌కు సంబంధించి ఏప్రిల్‌లో ఖాళీ అవనున్న మూడు స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. వీటి కోసం ఫిబ్రవరి 8న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ కానుంది. నామినేష‌న్‌కు చివ‌రి తేదీగా ఫిబ్రవరి 15ను ఎన్నిక‌ల సంఘం ప్రకటించింది. నామినేష‌న్ల పరిశీలనకు ఫిబ్రవరి 16, నామినేష‌న్ల విత్ డ్రాకు ఫిబ్రవరి 20, ఎన్నిక‌ల నిర్వహణ ఫిబ్రవరి 27గా ఎన్నిక‌ల సంఘం ప్రకటించింది.  తెలంగాణ‌లో ఖాళీ అవుతున్న మూడు సీట్లనూ కైవ‌సం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు క‌స‌ర‌త్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రస్తుత రాజ్యసభ ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను తమకు అనుకూలంగా వాడుకోవాలనే యోచనలో ఉన్నారట. రాజ్యసభ ఎన్నిక‌ల కోసం ఒక ప్రాసెస్ ఉంటుంది. నిబంధ‌న‌ల ప్రకారం ఖాళీ అవుతున్న మూడు సీట్లకు అదనంగా ఒకటి క‌లుపుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం నాలుగు సీట్లుగా లెక్కవేసుకుని అసెంబ్లీ సీట్లను డివైడ్ చేస్తారు. అంటే మొత్తం 119 అసెంబ్లీ సీట్లను డివైడెడ్ బై ఫోర్ (4) మాదిరిగా లెక్కబెట్టాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క రాజ్యసభ సీటు గెల‌వ‌డానికి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు అవ‌స‌ర‌మ‌వుతారు. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బ‌లాల మేర‌కు కాంగ్రెస్ సులువుగా రెండు, బీఆర్ఎస్ ఒక‌ స్థానాన్ని గెలుచుకునే అవకాశముంది.

అసెంబ్లీలో ఉన్న బ‌లాల ప్రకారం కాంగ్రెస్ సులువుగా రెండు రాజ్యసభ సీట్లు గెలుచుకునే అవకాశముండగా, మిత్రపక్షంతో క‌లుపుకొని మరో 5 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అద‌నంగా ఉంటాయి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటే మొత్తం సంఖ్యా బ‌లం 119 స్థానాల నుండి 111 స్థానాల‌కు ప‌డిపోతుంది. ఇక ఏంఐఏం కూడా దూరంగా ఉంటే ఆ సంఖ్యా బలం 104కు ప‌డిపోతుంది. అప్పుడు 104 స్థానాల‌ను నాలుగు భాగాలుగా విభ‌జించాల్సి ఉంటుంది. అప్పుడు ఒక్కో రాజ్యసభ సీటు బ‌లం 26కు ప‌డిపోతుంది. ఇక రాజ్యసభ ఎన్నిక‌ల్లో విప్ జారీ చేసే అవ‌కాశం ఉండ‌దు. ఎమ్మెల్యేలు త‌మ‌కు న‌చ్చిన వ్యక్తికి ఓటు వేయ‌వ‌చ్చు. ఇదే అదునుగా తీసుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కొంత మంది ఎమ్మెల్యేల‌ను త‌మ వైపు తిప్పుకొవాల‌ని భావిస్తోంది.

బీఆర్ఎస్ నుండి 13 మందిని త‌మ‌కు అనుకూలంగా ఓటు వేస్తే సెకండ్ ప్రియారిటీ ఓట్లతో మూడో సీటును కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చు. ఒకవేళ 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కాంగ్రెస్ మూడు రాజ్యసభ సీట్లను గెలుచుకునే ఛాన్స్ ఉంది. పదుల సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని పలువురు కాంగ్రెస్ నేతలు చెప్పడం, ఇటీవల పలువురు ఎమ్మేల్యేలు సీఏం రేవంత్ ని కలవడం లాంటివి చూస్తుంటే కాంగ్రెస్ ప్రయత్నిస్తే తమకి కావాల్సిన ఓట్లను సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.కాంగ్రెస్ మూడో రాజ్యసభ సీటుపై కూడా కన్నేయడంతో.. లోక్ సభ ఎన్నికలకు ముందు దీన్ని దక్కించుకోవడం బీఆర్ఎస్‌కు ఛాలెంజ్‌గా మారుతోంది.

తెలంగాణ నుంచి రాజ్యసభకు సోనియా..!

తమకి రానున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఏఐసీసీ అభీష్టం మేరకు కేటాయించగా, ఒక స్థానం కోసం పీసీసీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఏఐసీసీకి కేటాయించనున్న రాజ్యసభ స్థానాన్ని సోనియా గాంధీతో భర్తీ చేస్తే బాగుంటుందని టీ.కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వేరే రాష్ట్ర నేతలకు తెలంగాణ నుండి రాజ్యసభ అవకాశం ఇస్తే రాజకీయ ప్రత్యర్థుల నుంచి కాంగ్రెస్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణలో సోనియా గాంధీకి పాజిటివ్ టాక్ ఉంటుంది. తెలంగాణ నుండి రాజ్యసభకు సోనియా గాంధీని పంపిస్తే కాంగ్రెస్ నిర్ణయానికి తెలంగాణ ప్రజల మద్దతు ఉండడంతో పాటు రానున్న లోక్ సభ ఎన్నికలకు అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగొలు చెప్పినట్లు సమాచారం.

రాజ్యసభ రేసులో పలువురు కాంగ్రెస్ నేతలు

సోనియా గాంధీ తెలంగాణ నుండి లోక్ సభకి పోటీ చేయాలని తెలంగాణ పీసీసీ నాయకులు తీర్మానం కూడా చేశారు. అయితే సోనియా గాంధీ ఆరోగ్య కారణాలు, వయస్సు రీత్యా తను లోక్ సభకు పోటీ చేసే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది. కాబట్టి సోనియాను తెలంగాణ నుండి రాజ్యసభకు పంపితే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ నేతల్లో నడుస్తోంది. సోనియా గాంధీని తెలంగాణ నుండి రాజ్యసభ కోసం పోటీలో పెడితే ఎలాగూ విప్ ఉండదు కాబట్టి బీఆర్ఎస్ నేతల్లో కొందరు సైతం సోనియాకి ఓటేస్తారని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక రెండవ స్థానం కోసం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు రేణుక చౌదరి, వీహెచ్, అద్దంకి దయాకర్, బలరాం నాయక్, చిన్నారెడ్డి, వంశీ చందర్ రెడ్డి లాంటి నేతల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ స్ట్రాటజీ అమలై మూడవ సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తే ఇంకొకరికి కూడా అవకాశం కలుగుతుంది.

Follow Us