AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గవిస్తరణలో వీరికి ఛాన్స్.?

పార్లమెంటు ఎన్నికల సమరం ముగియడంతో మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారనే వార్తలు వస్తున్నాయి. కేబినెట్ కూర్పుపై ఢిల్లీలో పార్టీ అగ్ర నేతలతో కసరత్తు చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఇచ్చిన బాధ్యతను నెరవేర్చినందుకు కీలక నేతకు మంత్రి పదవి వరిస్తుందా ? అనే చర్చ జరుగుతోంది. ఆయన అనుచరులు మాత్రం ఈసారి తమ నేతకు అమాత్యయోగం గ్యారంటీ అనే ఆశతో ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోయింది.

Telangana: సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గవిస్తరణలో వీరికి ఛాన్స్.?
Cm Revanth Reddy
Srikar T
|

Updated on: Jun 30, 2024 | 9:15 PM

Share

పార్లమెంటు ఎన్నికల సమరం ముగియడంతో మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారనే వార్తలు వస్తున్నాయి. కేబినెట్ కూర్పుపై ఢిల్లీలో పార్టీ అగ్ర నేతలతో కసరత్తు చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఇచ్చిన బాధ్యతను నెరవేర్చినందుకు కీలక నేతకు మంత్రి పదవి వరిస్తుందా ? అనే చర్చ జరుగుతోంది. ఆయన అనుచరులు మాత్రం ఈసారి తమ నేతకు అమాత్యయోగం గ్యారంటీ అనే ఆశతో ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల పోరు ముగియడంతో ఇక కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని చర్చ జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ పార్టీ అధినేతలతో దీనిపై చర్చించి కసరత్తు చేశారనే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం సీఎం సహా కేబినెట్‌లో 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి విస్తరణలో ఛాన్స్‌ దక్కనుంది. ప్రస్తుతం మంత్రి వర్గంలో రేవంత్‌ సహా నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఈసారి అవకాశం దక్కవచ్చని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా, ఆ తర్వాత నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్ తరపున మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీజేపీ చేరిన రాజగోపాల్ రెడ్డి తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి 2023లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందట అధిష్టానం. ఇప్పటికే సీఎం రేవంత్ మంత్రి వర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీకి భువనగిరి పార్లమెంటు టికెట్ ఆశించినప్పటికి సీఎం రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది. ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకురావాలని అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి టాస్క్ ఇచ్చింది. ఎన్నికలకు కొత్తయిన చామల కిరణ్ గెలుపు బాధ్యతను రాజగోపాల్ రెడ్డి అన్ని తానై భుజాన వేసుకున్నారు. పార్టీ ఇచ్చిన టాస్క్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసి 2.86 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు.

పార్టీ ఇచ్చిన టాస్క్‌ను సక్సెస్‌ చేసినందుకు తన కోరికను తీర్చాలని అధిష్టానాన్ని రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారట. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి పదవి కోసం ఢిల్లీలో అగ్ర నేతలను రాజగోపాల్ రెడ్డి కలిశారని టాక్. పార్టీలో ఒకేసారి చేరిన జూపల్లి, పొంగులేటిలకు మంత్రి పదవులు దక్కి తనకు రాకపోవడంతో రాజగోపాల్ రెడ్డి అనుచరులు నిరాశతో ఉన్నారు. పార్టీలో చేరిక సమయంలో తనకు మంత్రి పదవిపై అధిష్టానం హామీ ఇచ్చిందని.. ఆయన గుర్తు చేస్తున్నారట. సోదరుడు వెంకటరెడ్డి మంత్రి పదవి..తనకు ఏమాత్రం అడ్డం కాదని భావిస్తున్నారట. తనకు హోం మంత్రి పదవి ఇస్తే అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను జైల్లో పెడతానని గతంలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

మలివిడత మంత్రివర్గ విస్తరణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవికి కొద్ది దూరంలో మాత్రమే ఉన్నానంటూ ఆయన క్యాడర్‌కు సంకేతాలు ఇస్తున్నారట. తాను కూడా మంత్రి అవుతానంటూ రాజగోపాల్ రెడ్డి ధీమాతో ఉన్నారట. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చానంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. మునుగోడు ప్రజలకు త్వరలో పార్టీ అధిష్టానం శుభవార్త చెబుతుందని ఆయన చెప్పారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన తాను స్వీకరిస్తానని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి సొంత గూటికి వచ్చిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని కాంగ్రెస్‌ స్వీప్ చేసిందని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి వల్లే భువనగిరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచాడని ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చినందుకు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో ఫైనల్‌గా అవకాశం దక్కుతుందా లేదా అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us