CM Revanth Reddy: మళ్లీ మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం చేరనుందా?

కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం మళ్లీ మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి చేరనుందా? దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారా? కొడంగల్‌ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలిపేందుకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి కామెంట్లు ఆసక్తిని రేపుతున్నాయి.

CM Revanth Reddy: మళ్లీ మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం చేరనుందా?
CM Revanth Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 25, 2023 | 3:25 PM

కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం మళ్లీ మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి చేరనుందా? దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారా? ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి కామెంట్లు ఆసక్తిని రేపుతున్నాయి.

కొడంగల్‌ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలిపేందుకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నారాయణపేట జిల్లాలో, ఇంకొన్ని మండలాలను వికారాబాద్‌ జిల్లాలో కలిపారు. వీటిని ఈ రెండు జిల్లాల పరిధి నుంచి మినహాయించి మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి మార్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. ఇది సీఎం రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇతర జిల్లాల పరిధిలో ఉన్న మండలాలను ఒకే జిల్లా పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. 2016 అక్టోబర్‌ 12న చిన్న జిల్లాలు ఏర్పడగా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించారు. ఈ జిల్లా పరిధిలోని షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని పూర్తిగా పాలమూరు జిల్లా నుంచి విడదీసి రంగారెడ్డి జిల్లాలో కలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చి మిగతా మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపారు. అంతేగాక కొన్ని నియోజకవర్గాల మండలాలను ఆయా జిల్లాల్లో కలపడంతో నియోజకవర్గ కేంద్రాలు ఒకవైపు, మండలాలు మరోవైపు అయ్యాయి. ప్రస్తుతం వీటిని సరిచేసే పనిలో పడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావటంతో అధికారులు నియోజకవర్గ స్వరూపాన్ని జిల్లాల పరిధి నుంచి మార్చే దిశగా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌ను మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలిపేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో కొడంగల్‌ను వికారాబాద్‌ జిల్లాలో కలిపారన్నారు గురునాథ్‌ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి తన కోరికను తీర్చమని కోరుకుంటా అన్నారు.

కొడంగల్‌ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలిపి గురునాథ్‌ రెడ్డి కోరికను సీఎం రేవంత్‌ తీరుస్తారేమో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…