Telangana: తొడసం మహిళ సాహసం.. రెండున్నర కిలోల నువ్వుల నూనే తాగేసింది
Telangana: ప్రతీ ఇంటినుంచి తీసుకువచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు మంగళవారం ఉదయం నుంచి ఖందేవునికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. వందల ఏళ్లుగా ఈ ఆచారం పాటిస్తున్నామని.. తొడసం ఆడపడుచులు మూడేళ్లకోసారి ఒకరు నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు తెలిపారు.
పుష్యమాసం వచ్చిదంటే అడవుల జిల్లా ఆదిలాబాద్ ఆదివాసీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. సాహసాలకు, సంస్కృతిక సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నిలయంగా మారుతుంది. అందులో భాగంగానే దశాబ్దాల నుంచి ఆచారంగా వస్తున్న సంప్రదాయాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ వస్తున్న ఆదివాసీల్లోని తొడసం తెగ తమ కట్టుబాట్లను పాటించి చూపింది. తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున సంప్రదాయంగా ఖందేవుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీ. తొడసం వంశీయులు ఆరాధ్య దైవం ఖందేవుడు కొలువై ఉన్న నార్నూర్ మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఖందేవుని జాతర ఘనంగా ప్రారంభమైంది. ఖందేవునికి నైవేద్యం పెట్టేందుకు నెలరోజుల ముందే ఆదివాసీలు ఇంట్లో నువ్వులనూనె తయారుచేయడం ఆనవాయితీ. అలా తయారు చేసిన నువ్వుల నూనేను దేవునికి నైవేద్యంగా సమర్పించేందుకు తీసుకువస్తారు. అలా ప్రతీ ఇంటినుంచి తీసుకువచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు మంగళవారం ఉదయం నుంచి ఖందేవునికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. వందల ఏళ్లుగా ఈ ఆచారం పాటిస్తున్నామని.. తొడసం ఆడపడుచులు మూడేళ్లకోసారి ఒకరు నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు తెలిపారు.
ఈ నెల 12న ఆదివారం రాత్రి మాన్కాపూర్లో మాసేమాల్ పేన్ దేవతకు తొడసం వంశస్తులు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి అక్కడే బసచేసి మరుసటి రోజు సోమవారం రాత్రి నాలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చిన తొడసం వంశస్తులు ఖందేవ్ క్షేత్రానికి చేరుకోగా… రాత్రి వారి ఆచారం ప్రకారం ఖందేవునికి పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మంగళవారం ఉదయం ఖందేవ్ ఆలయ సన్నిధిలో తొడసం వంశానికి చెందిన ఆడబిడ్డ నాగుబాయి చందు (కడోడ కిత్తకు చెందిన) తొడసం వంశంలోని ఇళ్ల నుంచి సేకరించిన రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి తమ మూడో మొక్కును తీర్చుకుంది. ఈమె మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జివితి తాలుకా కొద్దాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ ఆడబిడ్డ. ఇలా మొక్కడం వలన సంతాన యోగం.. కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం.
ఈ సందర్భంగా మహాపూజకు
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మహారాష్ర్ట ఎమ్మెల్యే తొడసం రాజు లకు తొడసం వంశీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఖందేవునికి ప్రత్యేక పూజలు చేశారు. తొడసం వంశస్తులు మహాపూజ, సంప్రదాయ మొక్కులు చెల్లించిన అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తొడసం వంశస్తులు ఒక దగ్గరకు చేరుకుని సంప్రదాయ భేటీ నిర్వహించారు. ఆలయ అభివృద్ధితో పాటు సంస్కతి, సంప్రదాయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆలయ ఆవరణలో మినీ ప్రజాదర్బార్ నిర్వహించి సమస్యలను వివరించారు.