
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రంలో వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూమిపూజలో పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా 99.55 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.43.80 కోట్లతో అత్యాధునిక వసతులతో వేద పాఠశాల నిర్మాణం. రూ.43.12 కోట్లతో భక్తులు, దీక్షాపరుల వసతి కోసం ప్రత్యేక సదనాలు, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ.9.87 కోట్లతో మండప నిర్మాణం, వైకుంఠ ద్వారం నుండి కొండపైకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రూ.1.41 కోట్లతో పైకప్పు నిర్మాణం పనులు చేపట్టనున్నారు. అలాగే రథశాల వైపు ఉన్న మాడవీధులకు రూ.1.35 కోట్లతో మెట్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, యాదాద్రిని మరింత ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడనున్నాయి.
వేదవిజ్ఞాన పరివ్యాప్తికి ప్రత్యేక పాఠశాల
తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడంలో భాగంగా వేదవిజ్ఞాన పరివ్యాప్తికి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన వేదపాఠశాల నెలకొల్పాలని సంకల్పించారు. దానిలో భాగంగా స్వామివారు కొలువైన యాదగిరికొండకు అభిముఖంగా ఉన్న పెద్దగుట్ట టెంపుల్‌సిటీ లేఅవుట్ వద్ద 15ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాలను నిర్మించనున్నారు. రూ.43.80కోట్ల అంచనా వ్యయంతో వేదపాఠశాల భవన సముదాయం నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి యాదగిరిగుట్ట దేవస్థానం కేవలం రూ.5కోట్లు కేటాయిస్తుండగా, మిగతా నిధులు దేవాదాయ శాఖకు చెందిన సర్వశ్రేయోనిధి( సీజీఎఫ్) నుంచి నిధులు సమకూర్చుతున్నారు.
ఆశ్రమ గురుకుల విద్యా బోధనా పద్ధతిలో 300 మంది విద్యార్థులకు, వేద బోధన అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి అవసరమైన వసతులు ఏర్పాటు కానున్నాయి. సువిశాల బోధనా మందిరాలు, సమావేశ మందిరం, వసతి భవనాలు, భోజనం సిద్ధం చేయడానికి సువిశాలమైన వంటగది, హోమాలు, యాగాలకు ప్రత్యేక శాలలతోపాటు గోశాలను నిర్మించనున్నారు. వేద పాఠశాలలో చేరే విద్యార్థులకు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలతో పాటు.. ఆగమ శాస్త్రాలను కూడా బోధిస్తారు. ఇది తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేద పాఠశాలగా నిలవనుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..