CM KCR: ప్రతి దళితుడికి ఆర్ఠిక సాయం అందాలి.. దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష
శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 నుండి చేపట్టబోయే దళిత బంధు అమలుపై చర్చ.
CM KCR Review on Telangana Dalit Bandhu: దళితుల్లో సమగ్రాభివృద్ధియే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమం కోసం ‘దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దళిత బంధు అమలుకు ప్రభుత్వం రూ. 500 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దళితుల అభివృద్దికి గాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధులో భాగంగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం కార్యచరణ కూడా సిద్దం చేశారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 నుండి చేపట్టబోయే దళిత బంధు అమలుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రి హరీష్‌రావు, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే, దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని మొదట అనుకున్నా.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మొదట ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేసి ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి భావించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి ఈ నియోజకవర్గంలో పథకాన్ని సంతృప్త స్థాయిలో ప్రతి కుటుంబానికి వర్తింపజేయాలని నిర్ణయించారు.
ఇదిలావుంటే, దళితబంధు పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఉపయోగపడే.. పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఉపాధి కల్పన కోసం..30 రకాల పథకాలను, కార్యక్రమాల జాబితాను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం మినీ డెయిరీ యూనిట్ నుంచి మినీ సూపర్ బజార్ వరకు వివిధ రకాల స్వయం ఉపాధి పథకాలను ఇందులో పొందుపరిచింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని..ఎంపిక చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 30 పథకాల్లో తమకు నచ్చిన ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ పథకం అమలుపై మరింత స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.