అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై రాష్ట్ర సర్కార్ కసరత్తు.. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
బడ్జెట్ 2021-22పై కసరత్తు మొదలు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గురువారం ప్రగతి భవన్‌లో ప్రభుత్వ ఉన్నతాదికారులతో సమావేశం నిర్వహించారు.
CM KCR Review on budget 2021 : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి రెండో వారంలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి రానున్న నిధులపై స్పష్టత వస్తోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను రూపొందించుకోంటోంది. ఇందులో భాగంగా కసరత్తు మొదలు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గురువారం ప్రగతి భవన్‌లో ప్రభుత్వ ఉన్నతాదికారులతో సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో పొందుపర్చాల్సిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
కేంద్ర బడ్జెట్ తర్వాత నిధులు, నిధుల కోతపైనా దృష్టి పెట్టారాయన. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులెన్ని, ఖజానాకు సమకూరే సొంత రాబడులెన్నీ.. అనే అంశాలపై ఫోకస్ చేశారు. అదే సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. చివరిసారిగా రాష్ట్ర శాసనసభ సమావేశాలు గత ఏడాది అక్టోబర్‌లో జరిగాయి. ఆ నెల 13న అసెంబ్లీ, 14న మండలి సమావేశాలను నిర్వహించారు. అయితే, ఈ ఏడాది జనవరిలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో నిర్వహించలేకపోయింది.
వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలను ఏప్రిల్ 13లోగా ప్రారంభించుకునేందుకు అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, 2021-2022 బడ్జెట్‌కు మార్చి 31వ తేదీలోగా అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి. ఈ మేరకు రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారీ కసరత్తు పూర్తి చేసుకుని, మార్చి రెండో వారంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ రాష్ట్ర బడ్జెట్ తయారీ ప్రక్రియ త్వరగా పూర్తయితే, మార్చి మొదటి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.