AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gajwel Ring Road: పెండింగ్‎లో గజ్వేల్ రింగ్ రోడ్డు పనులు.. ట్రాఫిక్‎కు తీవ్ర అంతరాయం..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గ పరిధిలో నిర్మించిన రింగ్ రోడ్డు పనులు పెండింగ్‎లో పడిపోవడంతో, ఆయా ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం మొదలు అవడమే చాలా లేట్ అంటే.. కొన్ని చోట్ల పనులు పెండింగ్‎లో పడిపోవడంతో గజ్వేల్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి రావడం లేదు.

Gajwel Ring Road: పెండింగ్‎లో గజ్వేల్ రింగ్ రోడ్డు పనులు.. ట్రాఫిక్‎కు తీవ్ర అంతరాయం..
Gajwel Ring Road Works
P Shivteja
| Edited By: Srikar T|

Updated on: Jan 31, 2024 | 11:30 PM

Share

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గ పరిధిలో నిర్మించిన రింగ్ రోడ్డు పనులు పెండింగ్‎లో పడిపోవడంతో, ఆయా ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం మొదలు అవడమే చాలా లేట్ అంటే.. కొన్ని చోట్ల పనులు పెండింగ్‎లో పడిపోవడంతో గజ్వేల్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి రావడం లేదు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఐదేండ్ల తర్వాత పనుల్లో పురోగతి సాధించినా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. భూసేకరణ, పరిహారం విషయంలో కోర్టు స్టేతో రెండు చోట్ల పనులు ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో గజ్వేల్ పట్టణానికి ట్రాఫిక్​ సమస్యలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.

ఈ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తే చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండకు వెళ్లే భారీ సరకు రవాణా వాహనాలు గజ్వేల్ పట్టణంలోపల నుంచి వెళ్లే అవసరం ఉండదు. ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఈ రింగ్ రోడ్డు వల్ల గజ్వేల్ పట్టణం నుంచి తొమ్మిది మార్గాలకు కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉన్నా, ఆ రెండు చోట్ల పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం ఏడు మార్గాల్లోనే కనెక్టివిటీ లభిస్తోంది. 2017లో గజ్వేల్‌‌ రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ పనులు మొదలైనాయి.. రిమ్మనగూడ సమీపంలోని రాజీవ్‌‌ రాహదారి నుంచి 22 కిలో మీటర్ల మేర రూ.220 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి.

మొదట 30 మీటర్ల వెడల్పుతో రింగ్ రోడ్డును నిర్మించాలని భావించినా తర్వాత రింగ్ రోడ్డు డిజైన్‎ను మార్చారు. వంద ఫీట్ల వెడల్పుతో ఫోర్ లైన్ రోడ్డుగా మార్పు చేసి 209 ఎకరాల భూమిని సేకరించారు. భూసేకరణ సమస్య కారణంగా చాలా రోజులు పనులు నత్తనడకన సాగాయి. కాగా మొన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో అధికారులు భూములు కోల్పోతున్న వారితో మాట్లాడి, రాజీవ్ రహదారిని ఆనుకుని పెండింగ్‎లో ఉన్న ఏడు కిలో మీటర్ల మేర బైపాస్ రోడ్డును ఎన్నికల ముందు అందుబాటులోకి తెచ్చారు. ఇంకా రెండు చోట్ల మాత్రం భూసమస్య పరిష్కారం కాకపోవడంతో పనులు ఆగిపోయాయి. 22 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న గజ్వేల్‌‌ రింగ్‌‌ రోడ్డులో మొత్తం మూడు బ్రిడ్జిలు, ఏడు సర్కిళ్లను ఏర్పాటు చేశారు. రాజీవ్‌‌ రహదారి పక్క నుంచి ఏడు కిలో మీటర్ల బైపాస్ రోడ్డు ఆరు లైన్లుగా 150 ఫీట్ల వెడల్పుతో, మిగతా 15 కిలో మీటర్లను100 ఫీట్లతో ఫోర్​లైన్ రోడ్డును నిర్మించారు.

ఇవి కూడా చదవండి

అయితే గజ్వేల్​రింగ్ రోడ్డు పూర్తయ్యేందుకు రెండు చోట్ల భూసేకరణ, పరిహారాల విషయంలో సమస్య వచ్చింది. దౌల్తాబాద్, చేగుంట మధ్య ధర్మారెడ్డిపల్లి వద్ద రైల్వే శాఖ ఆధ్వర్యంలో 1.6 కిలో మీటర్ల మేర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తుండగా ఇక్కడ భూసేకరణకు సంబంధించి ఏర్పడిన వివాదంతో పనులు ముందుకు కదలడం లేదు. గజ్వేల్–వర్గల్ రోడ్డులో పరిహారం విషయంలో కోర్టు స్టే కారణంగా 100 మీటర్ల మేర రోడ్డు పనులు నిలిచి పోయాయి. ఈ రెండు చోట్ల పనులు ఆగడంతో సిద్దిపేట, భువనగిరి, పాతూరు నుంచి తుఫ్రాన్‎కు వెళ్లేవారు తప్పనిసరిగా గజ్వేల్​పట్టణం నుంచి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పెండింగ్ పనులు పూర్తయితే గజ్వేల్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలో త్వరగా సమస్యను పరిష్కరించాలని వాహన దారులు, ప్రయాణీకులు కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..