బతికుండగానే తలిదండ్రులకు బుక్కెడు బువ్వ పెట్టని ఈ రోజుల్లో చనిపోయిన తల్లిదండ్రులకు ఆలయాన్ని కట్టి, నిత్య పూజలు చేస్తున్నారు కొడుకులు.ఈ అరుదైన ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో వెలుగు చూసింది. కందుల పల్లెకు చెందిన యదగిరి రాజయ్య, శంకరమ్మల దంపతులకు ఐదుగురు కుమారులు,ఓ కుమార్తె ఉన్నారు. రాజయ్య నాటువైద్యుడు..గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వైద్యం చేసి, బాగు చేసేవాడు. గత రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో శంకరమ్మ కాలం చేసింది. దీంతో రాజయ్య కూడా మనోవేదనకు గురై చనిపోయాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో కుమారులు తమ వ్యవసాయ క్షేత్రంలో తల్లిదండ్రులకు నిలువెత్తు విగ్రహాలు ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మించారు. నిత్య పూజలు చేస్తూ, తమ తల్లిదండ్రులు చనిపోలేదని, విగ్రహాల రూపంలో వారిని సజీవంగా చూస్తున్నామని కుటుంబ సభ్యులు అంటున్నారు.
చిన్నతనంలో తల్లిదండ్రులు చాలా కష్టపడి తమను పెంచారని, వారి రుణం ఎలా తీర్చుకుంటామని అంటున్నారు. అందుకే కొంతలో కొంతైనా వారి రుణం తీర్చుకునేందుకు నిలువెత్తు విగ్రహాలను నిర్మించామని చెప్పారు ఆ కుటుంబ సభ్యులు. నేటి సమాజంలో కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వారికి ఈ కొడుకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు ఈ విగ్రహాలను చూసి మరికొంతమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. వీరిలాగే కాలంచేసిన వారి వారి తల్లిదండ్రులకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి