Telangana Rains: ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయం.. భారీ వర్షాల నేపథ్యంలో కేసీఆర్‌ దిశానిర్దేశం..

Telangana Rains: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశాన్ని..

Telangana Rains: ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయం.. భారీ వర్షాల నేపథ్యంలో కేసీఆర్‌ దిశానిర్దేశం..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 23, 2022 | 5:45 PM

Telangana Rains: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయం అని తెలిపిన ముఖ్యమంత్రి అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘భారీ వర్షాల కారణంగా గోదావరి నది పొంగిపొర్లుతోంది. గోదావరి ఉప నదులు కూడా నిండి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో.. మొన్నటి కంటే వరదలు సంభవించే ప్రమాదం ఉంది. కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు’అని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్.ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎట్లా వస్తున్నాయనే విషయాలను సీఎం కేసీఆర్ కు వివరించారు.

ఇవి కూడా చదవండి

భారీ వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం ఎస్సారెస్పీ నుంచి, కడెం నుంచి వస్తున్న ప్రవాహాలను, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. వాతావరణ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే.. లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని రజత్ కుమార్ వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..