Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: పనుల నాణ్యతలో రాజీపడొద్దు.. సచివాలయాన్ని త్వరగా పూర్తిచేయండి: సీఎం కేసీఆర్

Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న

CM KCR: పనుల నాణ్యతలో రాజీపడొద్దు.. సచివాలయాన్ని త్వరగా పూర్తిచేయండి: సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 09, 2021 | 8:29 PM

Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయ పనులను గురువారం సీఎం కేసీఆర్ పరిశీలించారు. వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసుకుంటూ తుది మెరుగులకు సిద్ధమవుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రి సహా ఆర్అండ్‌బీ అధికారులను, వర్క్ ఏజెన్సీ ఇంజనీర్లతో పనుల గురించి చర్చించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్ ఛాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల ఛాంబర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తూ, అధికారులకు పలు సూచనలిచ్చారు. కారిడార్లు సహా గ్రౌండు ఫ్లోరు, మొదటి ఫ్లోరుతో సహా నిర్మాణంలో ఉన్న సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగారు. తుది దశ నిర్మాణంలో చేపట్టవలసిన ఎలివేషన్ తదితర ఫైనల్ వర్కుల కోసం ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, తదితర మోడళ్లను అధికారులు ప్రదర్శనకు పెట్టారు. వాటి నాణ్యతను, కలర్ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి ఎలివేషన్ ప్రకాశవంతంగా, సుందరంగా కనిపించేలా ఉండాలని సూచించారు.

వాల్ గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, యూపీవీసీ విండోస్, అల్యూమినియం ఫాబ్రికేషన్స్, మెట్లకు వేసే గ్రానైట్స్, ఫ్లోరైడ్ మార్బుల్స్, గ్రానైట్స్ పలు రకాల మోడళ్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా తన వెంట వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను ముఖ్యమంత్రి ఫైనల్ చేశారు. మోడల్ వాటర్ ఫౌంటేన్, లాండ్ స్కేప్, విశ్రాంతి గదులు, మీటింగ్ హాళ్లను సీఎం పరిశీలించారు. స్కై లాంజ్ నిర్మాణం గురించి సీఎం కేసీఆర్ కు అధికారులు వివరించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పనులపై ఆర్అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఈఎన్సీ గణపతి రెడ్డిలను అభినందించారు.

ప్రస్తుతం నడుస్తున్న విధంగానే పనులను వేగవంతంగా కొనసాగించాలన్నారు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ఆదేశించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు. ముఖ్యమంత్రి వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, నిర్మాణ ఏజెన్సీ ఫాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read:

Tejashwi Yadav Wedding: ఓ ఇంటి వాడైన బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్.. సాదాసీదాగా వివాహ వేడుక

Army Chopper Black box: అసలేంటి బ్లాక్‌ బాక్స్‌?.. విమాన ప్రమాదం గుట్టును ఎలా విప్పుతుంది?.. పూర్తి వివరాలివే..