ఒక వైపు నిత్యావసర వస్తువుల రేట్లు మండిపోతుంటే, మరో వైపు కూరగాయల రేట్లు చుక్కలనంటుతున్నాయి. ఇలాంటి సమయంలో చికెన్ ధరలు దిగొస్తూ.. నాన్ వెజ్ లవర్స్‌ని ఊరిస్తున్నాయి. సాధారణంగా ధరలు తగ్గితే, చికెన్ షాపులు కస్టమర్ తో కళకళలాడుతాయి. కానీ ఇప్పుడు కార్తీక మాసం ఎఫెక్ట్ తో చికెన్ షాపుల వైపు చూడటం లేదు నగర వాసులు. కార్తీకం ఎఫెక్ట్ తో చికెన్ సేల్స్ తగ్గాయి. దీంతో చికెన్ రేట్లు కూడా దిగొచ్చాయి అంటున్నారు వ్యాపారులు.
శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో చాలామంది మాంసం ముట్టరు. ఇంకొందరు స్వామి మాలలు వేస్తుంటారు. పూజలు, వ్రతాలు, నోములతో ఉపవాస దీక్షలతో నియమనిష్ఠలతో ఉంటారు చాలా మంది. అందుకే కార్తీక మాసం ఎఫెక్ట్ చికెన్ సేల్స్ పై కనిపిస్తుంది. కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి వీక్ డేస్ ఏ కాదు వీక్ ఎండ్స్ లో కూడా చికెన్ సేల్స్ తెగిపోయాయి. దీంతో చికెన్ రేటు కూడా వారం రోజులుగా దిగొస్తున్నాయి.
ఒక వైపు వాతావరణ పరిస్థితులు, మరో వైపు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. చికెన్‌కి డిమాండ్ తగ్గడంతో రేట్లు తగ్గుతున్నాయి. గత వారంలో లైవ్ బర్డ్ కేజీ 160 రూపాయల నుండి 180రూపాయిల వరకు, నాటు కోడి కేజీ 500 రూపాయిల పైనే పలికింది. డ్రెస్డ్ చికెన్ కేజీ 200 రూపాయల నుండి 210 రూపాయలు, స్కిన్ లెస్ 220 రూపాయల నుండి 230 రూపాయలు, బోన్ లెస్ 420 రూపాయల నుండి 450 రూపాయల వరకు ఉండేది.
కానీ, ప్రస్తుతం లైవ్ బర్డ్ కేజీ 100 రూపాయల నుండి 120 రూపాయల వరకు, నాటు కోడి కేజీ 400 రూపాయల వరకు పడిపోయింది. డ్రెస్డ్ చికెన్ కేజీ 160 రూపాయల నుండి 170 రూపాయలు, స్కిన్ లెస్ 180 రూపాయల నుండి 200 రూపాయలు, బోన్ లెస్ 340 రూపాయల నుండి 360 రూపాయల వరకు పలుకుతోంది. రేట్లతో పాటు గిరాకీ కూడా తగ్గింది.
కార్తీక మాసం కావడంతో చికెన్ సేల్స్ పడిపోయాయి అంటున్నారు వ్యాపారులు ..గతంలో వీకెండ్స్ లో ఫుల్ గిరాకీ ఉండేది. కానీ ఇప్పుడు కనీసం 50కేజీలు కూడా అమ్ముడు పోవడం లేదంటున్నారు. కార్తీక మాసం కంటే ముందు ప్రతి రోజు 100 కేజీలు, వీక్ ఎండ్స్ లో 500 కేజీలు చికెన్ అమ్ముడు పోయేది, కానీ ఇప్పుడు నెల మొత్తం కనీసం 100 కేజీలు కూడా అమ్మలేము అంటున్నారు మరి కొందరు వ్యాపారులు. అయితే కేవలం చికెన్ రేట్లు మాత్రమే కాదు. అన్ని రకాల నాన్ వెజ్ మార్కెట్లపై కార్తీకం ఎఫెక్ట్ కనిపిస్తుంది .
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..