Telangana: ఆగని వలసలు.. కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

|

Jun 28, 2024 | 4:30 PM

బీఆర్‌ఎస్‌కు షాక్‌లమీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య.. కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‎ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాలే యాదయ్య.

Telangana: ఆగని వలసలు.. కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
Congress Party
Follow us on

బీఆర్‌ఎస్‌కు షాక్‌లమీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య.. కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‎ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాలే యాదయ్య. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాదయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన.. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన యాదయ్య.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 268 ఓట్ల తేడాతో బయటపడ్డారు.

కాలె యాదయ్య చేరికతో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. దానం నాగేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, డాక్టర్‌ సంజయ్ ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిపోయారు. చేరికలపై సొంత పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. PCC చీఫ్‌, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. ఈ జంపింగ్స్ ఇక్కడితో ఆగవని చెప్పకనే చెప్పేశారు.

ఫస్ట్‌ సీజన్‌లో ముగ్గురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న రేవంత్‌రెడ్డి.. తాజాగా సెకండ్‌ సీజన్‌ను పోచారం శ్రీనివాస్‌రెడ్డితో స్టార్ట్‌ చేశారు. ఓవైపు పాలనలో స్పీడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. అటు టీపీసీసీ అధ్యక్షుడిగా ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రక్రియలో కూడా అదే దూకుడు కనబరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవకుండా పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇటీవలే పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్‌.. భవిష్యత్తుపై వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆ పార్టీ నుంచి మాత్రం వలసలు ఆగడం లేదు. సగం మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..తమ పార్టీలో చేరుతారని చెబుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. మరోవైపు బీఆర్ఎస్‌ఎల్పీ విలీనమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీ అనుకున్నట్టుగా 25 మంది ఎమ్మెల్యేలు చేరితే.. టెక్నికల్‌గా బీఆర్ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయినట్టే లెక్క. మరోవైపు ఈ వరుస పరిణామాలతో కౌంటర్‌ ఎలా ఇవ్వాలో తెలియక గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..