జగన్‌పై చంద్రబాబు గెలుపు.. 100 ఓట్ల మెజార్టీ.. అసలు కథ ఏంటంటే..?

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన సంఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండ్లరేవు సర్పంచ్ ఎన్నికలో చంద్రబాబు అనే అభ్యర్థి జగన్‌పై విజయం సాధించారు. ఏపీ ప్రముఖ నేతల పేర్లతో కూడిన ఈ పోరు, చివరికి చంద్రబాబు గెలుపుతో ముగియడం విశేషం. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జగన్‌పై చంద్రబాబు గెలుపు.. 100 ఓట్ల మెజార్టీ.. అసలు కథ ఏంటంటే..?
Chandrababu Vs Jagan Telangana Elections

Edited By:

Updated on: Dec 18, 2025 | 8:01 PM

రాజకీయాల్లో పేర్లు అప్పుడప్పుడు భలే వింతలను సృష్టిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య పోరాటం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే సరిగ్గా అవే పేర్లు ఉన్న ఇద్దరు నేతలు తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తలపడటం, అందులోనూ జగన్‌పై చంద్రబాబు గెలుపొందడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు పంచాయతీకి మూడో విడతలో భాగంగా డిసెంబర్ 17న ఎన్నికలు జరిగాయి. ఇక్కడ సర్పంచ్ పదవి కోసం భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్ పోటీ పడ్డారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వేర్వేరు వర్గాలకు నాయకత్వం వహిస్తున్నారు.

నువ్వా-నేనా అన్నట్టుగా పోరు

పార్టీ నేతలు వీరిద్దరిలో ఒకరిని తప్పించి ఏకగ్రీవం చేసేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. కానీ ఇద్దరు అభ్యర్థులు వెనక్కి తగ్గలేదు. పేర్లు ఏపీలోని అగ్రనేతలవి కావడంతో గ్రామస్తులు కూడా ఈ ఎన్నికను చాలా ఆసక్తిగా తీసుకున్నారు. ఈ గ్రామంలో మొత్తం మొత్తం 934 మంది ఓటర్లు ఉండగా.. 866 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చంద్రబాబుకు 480 ఓట్లు రాగా.. జగన్‌కు 380 ఓట్లు వచ్చాయి.  దీనితో తన సమీప ప్రత్యర్థి జగన్‌పై చంద్రబాబు 100 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఏపీలో సీఎం చంద్రబాబు ఉన్న సమయంలోనే, ఇక్కడ అదే పేరున్న వ్యక్తి విజయం సాధించడం గమనార్హం. కేవలం పేర్ల పోలిక వల్లే ఈ చిన్న పంచాయతీ ఎన్నిక ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి