తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న శనివారం తుది శ్వాస విడిచారు. తారక రత్న మృతదేహాన్ని బెంగులూరు నుంచి హైదరాబాద్ మోకిల లోని తన నివాసానికి తరలించారు. ఈ నేపథ్యంలోనే తారక రత్న భౌతిక దేహాన్ని సందర్శించుకోవడానికి సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరికి మోకిల చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మోకిల వెళ్లారు. తారకరత్న భౌతిక దేహాన్ని సందర్శించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
చిన్న వయసులోనే తారక రత్న మరణం చాలా బాధకరం అన్న బాబు.. ఆయన కుటుంబానికి ఎళ్లవేళలా అండగా ఉంటామని హామి ఇచ్చారు. మృత్వుతో పోరాడి చనిపోవడం బాధాకరం అన్నారు. చిన్న వయసులోనే ఎక్కువ సినిమాల్లో నటించిన తారక రత్న అమరావతి మూవీకి నంది అవార్డు అందుకున్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచనలో తారక రత్న ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక తారక రత్నను పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చేయడానికి ఎన్ని చేసినా భగవంతుడు సహకరించలేదని వాపోయారు.
తారక రత్న మరణం విషయంలో కుటుంబమంతా చాలా ఆవేదనతో ఉన్నామని, తారకరత్న పిల్లల్ని చూస్తే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎక్కడికి వెళ్లినా అభిమానులందరూ తారకరత్న ఆరోగ్యం ఎలాం ఉందని అడిగారని చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు దైవ నిర్ణయం విషయంలో మనం ఏమి చేయలేమన్న బాబు… తారక రత్న ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన భార్యకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని వేడుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి..