Telangana Rain Alert: తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..
Telangana Weather Update: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడనుందని, రానున్న 24 గంటల్లో అదికాస్తా వాయుగుండంగా
Telangana Weather Update: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడనుందని, రానున్న 24 గంటల్లో అదికాస్తా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. 48 గంటల్లో ఈ అల్పపీడనం బలపడి ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదిలాఉంటే.. రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుంచి అల్పపీడనం ప్రాంతం మధ్యగా పయనిస్తూ అండమాన్ వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అల్పపీడనం కారణంగా సముద్రతీర ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ నేపథ్యలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.
ఇదిలాఉంటే.. తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామం దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది దిందా వాగు.. దింగా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. బెజ్జూర్ మండలం ఉధృతంగా ప్రవహిస్తోంది సుస్మిర్ వాగు. దీంతో ఆరు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పైకాజి నగర్‌లో వరదనీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు అవస్థలు పడ్డారు. పిప్పర్ గోంది దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నారు. తాడుసాయంతో అతికష్టమ్మీద వాగు దాటుతున్నారు.
అటు ఖమ్మం జిల్లాలో 3 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వరద నీరు చేరడంతో ప్రాజెక్ట్ లు పొంగి పొర్లుతున్నాయి. పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్ట్ కు వరద నీరు చేరడంతో అలుగు పారుతోంది. సత్తుపల్లి లోని బేతుపల్లి చెరువుకు వర్షపు నీరు చేరడంతో ఒక అడుగు మేరకు అలుగు పారుతుంది. భారీ వర్షాల కారణంగా సత్తుపల్లి జెవిఆర్ ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లా తాడ్వాయి-పస్రా మధ్య జాతీయ రహదారి జలగలంచ వాగు వద్ద ఇసుకలారీ బోల్తా పడింది. ఏటూరునాగారం నుండి ఇసుక లోడ్ తో హనుమకొండకు వస్తున్న ఇసుకలారీ అదుపుతప్పింది. భారీ వరదల కారణంగా జాతీయ రహదారి తెగిపోయింది. తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకొన్న అధికారులు..మరోసారి రోడ్ సైడ్ తెగిపోవడంతో లారీబోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా డ్రైవర్ బయటపడ్డాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..